ఆలయ నిర్మాణానికి అనుమతివ్వండి
తిరువళ్లూరు: అమ్మవారి ఆలయ నిర్మాణానికి తరచూ అడ్డుచెబుతూ బెదిరింపులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద అరుంబాక్కం గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా మన్నవేడు సమీపంలోని అరుంబాక్కం గ్రామంలో 60 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఉంది. ఆలయంలో స్థానికులు ఆషాడం, తైమాస ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి స్థానికులే కాకుండా పొరుగు గ్రామాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న క్రమంలో, పాత ఆలయాన్ని కూల్చి, కొత్త ఆలయాన్ని నిర్మించాలని స్థానికులు నిర్ణయించారు. అయితే కొత్త ఆలయం నిర్మాణం చేయాలనుకుంటున్న స్థలం తమదేనని అదే గ్రామానికి చెందిన మూడు కుటుంబాలు అడ్డుతగులుతూ అక్కడే అన్యమత ఆలయ నిర్మాణానికి యత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో గ్రామస్తులు విలేజ్ రికార్డును పరిశీలించగా, సంబంధిత స్థలం అమ్మవారి ఆలయానికి చెందినదిగా నిర్ధారించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతోపాటు అడ్డుతలుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో హిందు మున్ననీ జిల్లా అధ్యక్షుడు వినోద్‌కన్నాతో పాటు పలువురు పాల్గొన్నారు.


