మద్యం మత్తులో హల్‌చల్
– రాళ్ల దాడికి దిగిన ముగ్గురి అరెస్ట్
తిరువళ్లూరు: మద్యం మత్తులో అర్ధరాత్రి జాతీయ రహదారిపై పరస్పరం రాళ్ల దాడికి దిగి హల్‌చల్ సృష్టించిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మద్యం మత్తులో స్థానిక అగ్నిమాపక కార్యాలయం వద్ద హల్‌చల్ సృష్టించారు. దారిన వెళ్లే వారిపై రాళ్ల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు నుంచి ఈకాడు వైపు వెళ్తున్న ఉదయకుమార్‌కు రాయి తలగడంతో అతడికి స్వల్పంగా గాయమైంది. దీంతో ఉదయకుమార్‌కు, తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. విషయం ఉదయకుమార్ స్నేహితులకు తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకోగా, ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. విషయం తెలుసుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన సంతోష్, రాజేష్, శంకర్ అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుత్ చోరీపై జరిమానా
తిరువొత్తియూరు: తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి అమలు డివిజన్ల పరిధిలోని మేట్టూరు, తిరుప్పూరు, గోపి, పల్లడం, ఈరోడ్, నామక్కల్, మదురై, తంజావూరు, తిరుప్పత్తూరు, కళ్లకురిచ్చి, వేలూరు, విలుప్పురం, తిరువణ్ణామలై విద్యుత్ పంపిణీ సర్కిళ్ల పరిధిలో గత నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విద్యుత్ చోరీపై తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో 78 విద్యుత్ చోరీలు, 30 నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు కనుగొన్నారు. దీనికి నష్ట పరిహార రుసుముగా రూ.96,70 ,254 విద్యుత్ వినియోగదారులకు విధించబడింది. సంబంధిత విద్యుత్ వినియోగదారులు నేరాన్ని అంగీకరించి, క్రిమినల్ చర్యలను నివారించడానికి ముందుకు వచ్చి, దానికి సంబంధించిన సయోధ్య మొత్తంగా రూ.5 లక్షల వెయ్యి చెల్లించినందున, వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఎటువంటి క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేయబడలేదని విద్యుత్ బోర్డు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.


