ఎన్నికలకు సిద్ధం కావాలి
–జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పిలుపు
తిరువళ్లూరు: అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో బూత్ కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే అజెండాగా పనిచేయాలని కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు శశికుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరువళ్లూరు నార్త్ జిల్లా కాంగ్రెస్ నిర్వాహకుల ప్రత్యేక సమావేశం వెంగత్తూరులో జిల్లా అధ్యక్షుడు శశికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఓబీసీ వర్కింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేషన్, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకాటూరు ఆనందన్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్ పాల్గొన్నారు. శశికుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరును మార్చడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు నిత్యం ప్రజల్లో వుండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిన వారిని గుర్తించి మళ్లీ క్రియాశీలకంగా పనిచేయించడంతో పాటు పార్టీలో వున్న చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఖలీల్‌రెహ్మాన్ పాల్గొన్నారు.


