వైభవం.. ద్రౌపది ఆలయ కుంభాభిషేకం
తిరువళ్లూరు: ఎల్లాపురంలో ద్రౌపది అమ్మవారి ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేసిన గ్రామస్తులు బుధవారం ఘనంగా కుంభిబిషేకం నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ 82–పనపాక్కంలో ద్రౌపది అమ్మ వారి ఆలయం వుంది. ఆలయం శిథిలావస్థకు చేరడంతో జీర్ణోద్ధరణ చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. అనంతరం నిధులు వసూలు చేసి గత ఏడాది ఆలయ జీర్ణోద్ధరణ పనులను చేశారు. పనులు పూర్తయిన క్రమంలో బుధవారం ఉదయం కలశపూజ, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం పది గంటలకు కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయ గోపురంపై వున్న కలశాలపై పుణ్యజలాలు వదిలి కుంభాబిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో గుమ్మిడిపూండి ఎమ్మెల్యే టీజే గోవిందరాజన్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.శేఖర్, ఎల్లాపురం యూనియన్ జె.మూర్తి, వివిధ పార్టీ ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు.
తిరువళ్లూరు: పుల్లరంబాక్కంలోని వళ్లీ దేవసేన సమేత కుమారస్వామి ఆలయంలో పాలాభిషేకం బుధవారం ఘనంగా నిర్వహించారు. పుల్లరంబాక్కంలోని కుమారస్వామి ఆలయంలో ప్రతిఏటా తైపూసం ఉత్సవాలకు ముందు పాలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం రెండు వందల మంది మహిళలు పాలబిందెలతో ఊరేగింపుగా వెళ్లి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు. ఫిబ్రవరి 1న వార్షిక, తైపూసం ఉత్సవాలు నిర్వహించనున్నారు.
వైభవం.. ద్రౌపది ఆలయ కుంభాభిషేకం


