రేపు తేనాంపేట, కోడంబాక్కంలో నీటి సరఫరా నిలిపివేత
కొరుక్కుపేట: మెట్రో రైలుపనుల కోసం చైన్నెలోని తేనాంపేట, కోడంబాక్కం ప్రాంతాల్లో ఈనెల 30న నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు బుధవారం తెలిపారు. వివరాలు.. నుంగంబాక్కంలోని ఉత్తమర్ గాంధీ సాలై వద్ద ప్రధాన నీటి సరఫరా పైపును అనుసంధానించే పనుల కారణంగా, 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి 31వ తేదీ ఉదయం 10 గంటల వరకు 24 గంటల పాటు నీటి సరఫరా నిలిపి వేయనున్నారు. ఈనేపథ్యంలో తేనాంపేట, కోడంబాక్కం మండలాల్లో పైపుల ద్వారా తాగునీటి సరఫరా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. అలాగే నుంగంబాక్కం, కోడంబాక్కం, మైలాపూర్, నందనం, వడపళని, పశ్చిమ మాంబలం, వల్లువర్ కొట్టం వంటి ప్రాంతాల్లోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, స్థానికులు ముందుజాగ్రత్త చర్యగా తాగునీటిని నిల్వ చేసుకోవాలన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో
ఫిర్యాదుల స్వీకరణ
కొరుక్కుపేట: పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించడం ద్వారా సత్వర చర్యలు తీసుకోవాలని చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ అరుణ్ పోలీసు అధికారులను ఆదేశించారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రతి బుధవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎ. అరుణ్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, తక్షణమే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను అదేశించారు. ఈ శిబిరంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. సుబ్బులక్ష్మి (పరిపాలన) తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో 709 ఖాళీల భర్తీకి ప్రభుత్వ ఆమోదం
కొరుక్కుపేట: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉండగా, తమిళనాడు ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న 709 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ విషయంలో, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడీ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖ కింద ఖాళీగా ఉన్న పోస్టులు 120 జీపు డ్రైవర్లు, 56 రిజిస్ట్రేషన్ క్లర్క్‌లు, 421 ఆఫీస్ అసిస్టెంట్లు, 112 గార్డులు సహా మొత్తం 709 పోస్టుల ఉన్నాయి. మూడు సంవత్సరాలకు పైగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయడానికి, గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ ఏప్రిల్ 2024లో అనుమతి కోరింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఇప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నందున నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే ఉద్యోగ ప్రకటనలు జారీ చేయలేమని అధికారులు పేర్కొన్నారు.
తిరువొత్తియూర్ పశ్చిమ ప్రాంతంలో..
– రూ.4.38 కోట్ల వ్యయంతో జర్మన్ సాంకేతికతో వర్షపు నీటి సేకరణ
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరు ప్రాంతంలో రూ.4.38 కోట్లతో జర్మన్ సాంకేతికతతో వర్షపు నీటి సేకరణ స్పాంజ్ పార్క్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. చైన్నె కార్పొరేషన్ పలుచోట్ల వర్షపు నీటి కాలువలు ఏర్పాటు చేసి వరద నీటిని సముద్రంలోకి పంపుతోంది. కాగా తగినంత స్థలం లేకపోవడంతో, జర్మన్ సాంకేతికతతో వర్షపు నీటిని పీల్చే స్పాంజ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఈక్రమంలో తిరువొత్తియూర్ పశ్చిమ ప్రాంతంలో 7వ వార్డులోని ఏడు గ్రౌండ్స్ పార్కులో రూ.4.38 కోట్ల వ్యయంతో వర్షాకాలంలో 8 లక్షల లీటర్ల నీటిని సేకరించే స్థాయిలో జర్మన్ సాంకేతికతతో వర్షపు నీటి సేకరణ స్పాంజ్ పార్క్ ఏర్పాటు పనులను కౌన్సిలర్ డాక్టర్ కె. కార్తీక్ ప్రారంభించారు. దీనిద్వారా ఈ ప్రాంతంలో నీటి కొరత ఉండదని, ఇక్కడ సేకరించిన వర్షపు నీరు ఈ ప్రాంతంలోనే నిల్వ చేయడం వల్ల ఉప్పు నీరు మంచి నీరుగా మారుతుందన్నారు. దీని వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. తార్యక్రమంలో అధికారులు, అన్నాడీఎంకే ప్రముఖులు కణ్ణన్ స్టీఫెన్, రెసిడెన్షియల్ అసోసియేషన్ నిర్వాహకులు జార్జ్ మంగళం పళని తదితరులు పాల్గొన్నారు.


