చైన్నె పోర్ట్‌లో రూ.30 కోట్లతో ప్యాసింజర్ టెర్మినల్
సాక్షి, చైన్నె: చైన్నె పోర్ట్‌లో రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్‌ను బుధవారం ఉపయోగంలోకి తీసుకొచ్చారు. చైన్నె పోర్టులో అండమాన్ లక్షద్వీప్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ ఆధునిక ప్యాసింజర్ టెర్మినల్‌ను నిర్మించారు. అలాగే రూ.23 కోట్ల వ్యయంతో దేశీయంగా అభివృద్ధి చేసిన షిప్పింగ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్, మరో రూ.10 లక్షలతో పునరుద్ధరించిన సముద్ర రవాణా మౌలిక సదుపాయాలను కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చారు. అలాగే చైన్నె డిపార్ట్‌మెంటల్ ప్రధాన కార్యాలయంలో రూ.1.5 కోట్ల వ్యయంతో చేపట్టిన నిల్వ వాయిల్ ఈ–ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కూడా జరిగింది. చైన్నె పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎస్. విశ్వనాథన్ అధ్యక్షతన తన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హార్బర్ల శాఖ కార్యదర్శి విజయకుమార్ హాజరయ్యారు. మొత్తం రూ.54 కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయన్నారు. పోర్టు సామర్థ్యాన్ని పెంచడంతో పాటూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులను గురించి అధికారులతో సమీక్షించారు. చైన్నె పోర్ట్ పనితీరు, కార్యాచరణ సామర్థ్యం, ఆర్థిక స్థితి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల గురించి సమీక్షించారు. భారతదేశ తూర్పు సముద్ర తీరానికి ముఖ్య ప్రవేశ ద్వారంగా చైన్నె పోర్ట్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం పోర్టు వినియోగదారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని, వారి ఫిర్యాదులు, సూచనలను విన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాల అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


