ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం

Jan 28 2026 7:02 AM | Updated on Jan 28 2026 7:02 AM

ఎన్‌క

ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం

● పెరంబలూరులో కలకలం ● ఎస్‌ఐకు గాయాలు

సాక్షి, చైన్నె : పేరు మోసిన రౌడీ కొట్టురాజ్‌ (30) పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మంగళవారం ఈ ఘటన పెరంబలూరు జిల్లా తిరుమాదురైలో కలకలం సృష్టించింది. వివరాలు..మదురైలో పేరు మోసిన దాదా వెల్లకాళీని గతంలో పోలీసులు అరెస్టు చేసి కట కటాలలోకి నెట్టారు. దిండుగల్‌ జైలులో ఉన్న ఇతడిని ఈనెల 24న ఓ కేసు విచారణ నిమిత్తం పుదుకోట్టై కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాలతో గట్టి భద్రత నడుమ చైన్నె పుళల్‌కు తరలించారు. మార్గం మధ్యలో పెరంబలూరు సమీపంలోని తిరుమాదురై వద్ద పోలీసులు, రౌడీ కాళీతో పాటు హోటల్‌లో భోజనం చేయడానికి వెళ్లారు. అప్పటికే రహస్యంగా వీరిని రెండు కార్లలో వెంబడిస్తూ వచ్చిన ముఠా రౌడీ కాళీని హత్య చేసేందుకు స్కెచ్‌ వేసి నాటు బాంబులతో దాడిచేసింది. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. దీంతో ఎస్‌ఐ రామచంద్రన్‌ రివాల్వర్‌కు పని పెట్టారు. ఆయన ఫైర్‌ చేయడంతో కారులో వచ్చిన వారంతా ఉడాయించారు. సమాచారం అందుకున్న తిరుమాదురై, మంగళ మేడు పోలీసులు ఆ రెండు కార్లను సినీఫక్కీలో ఛేజింగ్‌ చేశారు. సమీపంలోని చెక్‌ పోస్టును ఢీకొట్టి మరీ ఆ కార్లు అదృశ్యమయ్యాయి. ఓ కారు ఎలత్తూరు సమీపంలో ఆపి పారిపోయారు. ఇక, నాటు బాంబుల దాడిలో గాయపడ్డ పోలీసులు మరుదు పాండి, రామచంద్రన్‌, విఘ్నేష్‌ను ఆస్పత్రికి తరలించారు.

ఐదు బృందాలతో..

రౌడీ వెల్లకాళీపై హత్యాయత్నానికి తెగబడింది మరో రౌడీ..అళగురాజ్‌ అతడి అనుచరులని పెరంబలూరు పోలీసులు గుర్తించారు. ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలించాయి. సోమవారం ఊటీలో కొందరిని, కళ్లకురిచ్చి జిల్లా నైనార్‌ పాళయం వద్ద ఏడుగురిని అరెస్టుచేశారు. వీరిలో రౌడీ కొట్టు రాజ్‌ సైతం ఉండటంతో అతడిని విచారణ చేశారు. నాటు బాంబులు, ఆయుధాలను తిరుమాదురైలో దాచి పెట్టినట్టు అతడు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు భద్రత నడుమ అక్కడకు వెళ్లారు. అయితే, రాజ్‌ నాటు బాంబులతో దాడులు చేయడంతో పోలీసులకు కంగుతిన్నారు. ఈ దాడిలో ఎస్‌ఐ శంకర్‌తో పాటు కానిస్టేబుల్‌ గాయపడడంతో మంగళమేడు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ నందకుమార్‌ కాల్పులు జరిపాడు. తూటా తలకు తగలడంతో కొట్టు రాజ్‌ కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గాయపడ్డ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పెరంబలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పెరంబలూరు జిల్లా ఎస్పీ జీఎస్‌ అనిత సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. అలాగే తిరుచ్చి జోన్‌ ఐజీ బాలకృష్ణన్‌ సైతం హుటాహుటిన పెరంబలూరుకు చేరుకుని గాయపడ్డ పోలీసులను పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు ఐజీ పేర్కొన్నారు. కొంత కాలంగా తమిళనాడులో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం మానేశారు. పట్టుబడే రౌడీలకు పిండికట్టు ట్రీట్‌ మెంట్‌ అన్నట్టుగా కాళ్లూచేతులు విరిచి పడేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్‌కౌంటర్‌ చర్చనీయాంశమైంది.

ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం1
1/2

ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం

ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం2
2/2

ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement