ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. ఆదుకోండి! | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. ఆదుకోండి!

Jan 27 2026 8:12 AM | Updated on Jan 27 2026 8:12 AM

ఆర్థి

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. ఆదుకోండి!

● పద్మశ్రీకి ఎంపికై న కృష్ణన్‌ కుటుంబం కన్నీళ్లు

సాక్షి, చైన్నె : తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాం... పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి...ఆదుకోండి.. అని పద్మశ్రీ అవార్డుకు ఎంపికై న చిత్రకారుడు కృష్ణన్‌ కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది. ఆదివాసి కళాకారుడిగా ఆర్‌ కృష్ణన్‌కు పద్మశ్రీ దక్కిన నేపథ్యంలో ఆయన కుటుంబం కడు పేదరికంలో కొట్టు మిట్టాడుతుండటంతో వెలుగులోకి వచ్చింది. రిపబ్లిక్‌ డే వేడుకలలో భాగంగా ఆదివారం కేంద్రం పద్మా అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఇద్దరికి పద్మ భూషన్‌, పది మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో తాజాగా ఆర్‌ కృష్ణన్‌ కుటుంబం వార్తలోకి చేరింది. కృష్ణన్‌ ఈ భూమి మీద లేరు. జీవించి ఉన్నప్పుడే పద్మశ్రీ ఇచ్చి ఉంటే తమ తలరాతలు వేరే విధంగా ఉండి ఉంటాయి... ఏమో అని కృష్ణన్‌(53) అలియాస్‌ కిట్నా సతీమని సుశీల ఆవేదన వ్యక్తం చేశారు.

చదివింది ఆరో తరగతి..

నీలగిరిజిల్లా కోతగిరి తాలుకా వనప్పకుడి కొంబై గిరిజన గ్రామానికి చెందిన కృష్ణన్‌ అలియాస్‌ కిట్నా చదువుకుంది ఆరో తరగతి వరకే . అయితే, చిత్రకారుడిగా తనలోని ప్రతిభతో అందరి దృష్టిలో పడ్డారు. 30 సంవత్సరాలుగా కాన్వాస్‌, ఫాబ్రిక్‌ పెయిటింగ్స్‌ ద్వారా కురుంబర్ల కళా ప్రతిభను చాటుతూ వచ్చారు. తన చిత్రాలను చిత్రీకరించేందుకు ఆకులు, గడ్డి, పేడ, మట్టి , ఇతర మూలికలతో తయారు చేసిన సహజ రంగులను మాత్రమే ఉపయోంచే వాడు. ఆయనకు భార్య సుశీల, ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణన్‌ జీవించి ఉన్నంత వరకు కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోషించారు. అయితే గత ఏడాది మార్చిలో కృష్ణన్‌ కన్నుమూశారు. దీంతో ఆకుటుంబం ఆర్థిక కష్టాలలో మునిగింది. తమను ఎవరూ పట్టించుకోక పోవడంతో కొంబై గ్రామాన్ని వీడి కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపంలోని కల్లార్‌ ప్రాంతంలోని ఉన్న ఓ తోటలో సుశీల కూలి పనులకు వెళ్తూ తన పిల్లలను పోషిస్తూ వచ్చారు. తాజాగా కృష్ణన్‌కు పద్మశ్రీ అవార్డు దక్కిందన్న సమాచారంతో మీడియా వారిని వద్దకు చేరుకోగా కడు పేదరికంలో పడుతున్న పాట్లు వెలుగులోకి వచ్చాయి.

జీవించి ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే : భార్య సుశీల

కృష్ణన్‌కు పద్మశ్రీ దక్కడం ఆదివాసి సంఘాలలో ఆనందాన్ని నింపాయి. అతడి కుటుంబంలో సైతం ఆనందం వెల్లి విరిసింది. అయితే, తన భర్త జీవించి ఉన్నప్పుడు ఈ అవార్డు ఇచ్చి ఉంటే, తమ తలరాతలు వేరే విధంగా ఉంటాయి ఏమో....మరింత ఆనందం కలిగి ఉండేదేమో అని ఉద్వేగానికి సుశీల లోనయ్యారు. తన పిల్లలకు ఫీజులు కూడా చెల్లించ లేని పరిస్థితులలో జీవనం సాగిస్తున్నామన్నారు. పెద్ద కుమార్తె వాసుకి కళాశాల చదువును మానేసి తనతో పనులకు వస్తున్నట్టు పేర్కొన్నారు. కుమారుడు రాహుల్‌ 9వ తరగతి, మరో ఇద్దరు కుమార్తెలు గీత ఏడో తరగతి, కీర్తన 4వ తరగతి చదువుతున్నారని వివరించారు. ప్రభుత్వం స్పందించాలని, సాయం అందించాలని, తన పిల్లల చదువుకు బాట వేయాలని ఆమె విన్నవించారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. ఆదుకోండి! 1
1/1

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. ఆదుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement