లైట్ హాటెడ్ కథా చిత్రాలు చేయడం రాదు
తమిళసినిమా: మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన లోకేశ్ కనకరాజ్ ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. ఇవన్నీ భారీ యాక్షన్ ఎంటర్‌టెయినర్ కథా చిత్రాలే అన్నది గమనార్హం. కాగా ఈయన ఇటీవల రజనీకాంత్ హీరోగా చేసిన కూలీ చిత్రం అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలను ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఈయన డ్రగ్స్ నేపధ్యంలోనే చిత్రాలు చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇక రజనీకాంత్, కమలహాసన్ కలిసి నటించే చిత్రం, హిందీలో అమీర్‌ఖాన్ హీరోగా చేయాల్సిన చిత్రం వెనక్కి పోయాయనే ప్రచారం జరిగింది. అదే విధంగా కార్తీ హీరోగా తెరకెక్కించనున్న చిత్రానికి సుమారు రూ. 70 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా వీటన్నింటికీ సోమవారం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ బదులిచ్చారు. ముందుగా రజనీకాంత్ హీరోగా చేసిన కూలీ చిత్రం మంచి లాభాలను తెచ్చిపెట్టిందని నిర్మాతల వర్గం చెప్పారన్నారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడానికి హైప్ ప్రచారమే కారణం అన్నారు. అయితే తాము అలాంటి ప్రచారం చేయకపోతే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనదని, అలాంటప్పుడు తాము ఇక్కడ నిలబడలేమని అన్నారు. రజనీకాంత్, కమలహాసన్ కలిసి నటించే చిత్రం నుంచి తానే వైదొలిగినట్లు చెప్పారు. వారి కోసం ఒక యాక్షన్ ఎంటర్ టెయినర్ కథను సిద్ధం చేసినట్లు, దాన్ని వారిద్దరికీ విడివిడిగా చెప్పినట్లు పేర్కొన్నారు. ఇద్దరికీ కథ నచ్చిందని అయితే రజనీకాంత్, కమలహాసన్ ప్రస్తుతం యాక్షన్ కథా చిత్రాలే చేస్తుండడంతో మంచి లైట్ హార్టెడ్ కథ కావాలని వారు చెప్పారన్నారు. కానీ తనకు లైట్ హార్టెడ్ కథతో చిత్రం చేయడం రాదని, అందుకే ఆ చిత్రం నుంచి బయటకు వచ్చానని చెప్పారు. ఇకపోతే డ్రగ్స్ నేపధ్యంలోనే చిత్రాలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని, తన చిత్రాల్లో డ్రగ్స్ సన్నివేశాలు చోటు చేసుకుంటున్నా, అందులో అంతిమంగా డ్రగ్స్ వాడటం మంచిది కాదనే చెబుతున్నానని చెప్పారు. కాగా తాను చేయాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయన్నారు. ఖైదీ– 2, విక్రమ్– 2, అమీర్‌ఖాన్ హీరోగా చిత్రం ఉన్నాయని చెప్పారు. అమీర్‌ఖాన్‌తో చేసే చిత్రం ఆగిపోలేదని చెప్పారు. కాగా తాజాగా టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా చిత్రం చేయనున్నట్లు చెప్పారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని తెలిపారు. ఆ తరువాత కార్తీ హీరోగా ఖైదీ– 2 చిత్రం ఉంటుందని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఈయన డీసీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.


