రాజకీయ సుడిగుండంలో రామన్న
సాక్షి, చైన్నె: రాజకీయాలలో సీనియర్‌గా ఉన్న రాందాసు తాజాగా సుడిగుండలో చిక్కుకున్నట్టుగా పరిస్థితి మారింది. తనయుడు రూపంలో ఎదురైన సమస్యతో ఆయన ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటారా? అన్న చర్చ ఊపందుకుంది. పీఎంకే వ్యవస్థాపకుడిగా రాందాసు రాజకీయ చాతుర్యం గురించి తెలిసిందే. వన్నియర్ సామాజిక వర్గం అంతా ఆయన కనుసన్నల్లోనే ఉండేది. కాలక్రమేనా ఆయన కూటములను మార్చడంతో ఆ సామాజిక వర్గం దూరం అవుతూ వస్తున్నది. తాజా ఎన్నికల ద్వారా తమ బలాన్ని మళ్లీ చాటుకోవాలన్న వ్యూహంతో ఉన్న రాందాసుకు తనయుడు అన్బుమణి రూపంలో పెద్ద సమస్య వచ్చి పడింది. రాందాసును పక్కన పెట్టి పార్టీని ఆయన తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. పార్టీకి తానే అధ్యక్షుడ్ని అని ప్రకటించుకోవడమే కాకుండా అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలోకి పీఎంకేను చేర్చేశారు. అయితే తాజాగా రాందాసు శిబిరంగా , అన్బుమని శిబిరంగా పీఎంకే రాజకీయాలు సాగుతూ వస్తున్నాయి. ఈసమయంలో రాందాసు పరిస్థితి ఎటు వెళ్లాలో అంతు చిక్కనట్టుగా మారింది. ఇందుకు కారణం డీఎంకేతో కలిసి వెళ్లే ప్రయత్నం చేసినా, అక్కడ వీసీకే ఉండటం చిక్కుల్లో పడేసినట్టైంది. వీసీకేను డీఎంకే దూరం చేసుకునే అవకాశాలు ఉండబోవు. ఒక వేళ డీఎంకేలో చేరడానికి ప్రయత్నాలు చేసినా, వీసీకే రూపంలో వ్యతిరేకత వస్తుందేమో అన్న కలవరం తప్పడం లేదు. అలాగే, ఆశించిన సీట్లు దక్కవేమో అన్న బెంగ తప్పన్నట్టు సమాచారం. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేతులు కలిపే యోచనలో సైతం ఉన్నట్టు సమాచారం. రాజకీయ అనుభవాలను విజయ్‌కు పంచే దిశగా టీవీకేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంబంధించి పార్టీ వర్గాలతో రాందాసు మంతనాలలో మునిగి ఉండడం గమనార్హం. రాజకీయ సుడిగుండలో చిక్కుకున్న రాందాసు, ఒకటి రెండు రోజులలో కూటమి విషయంగా నిర్ణయం తీసుకోవచ్చు అని, లేదా, ఎన్నికలకు దూరంగా ఉన్నా... ఉండవచ్చు అన్న భావనలో ఉన్నట్టుగా ఆయన మద్దతు నేతలు పెదవి విప్పుతున్నారు.
రాందాసు


