రాష్ట్ర కమిటీ జాబితాపై కసరత్తు
సాక్షి, చైన్నె: టీఎన్‌సీసీలో రాష్ట్ర కమిటీ జాబితా కసరత్తు వేగవంతం చేశారు. వారం రోజులలో 150 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సెల్వ పెరుంతొగై లోక్‌సభ ఎన్నికలకు ముందుగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తదుపరి పార్టీ బలోపేతం దిశగా విస్తృతంగా చర్యలు చేపట్టారు. అలాగే జిల్లాల కార్యవర్గాలను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ఏఐసీసీపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతులయ్యారు. ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగి జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేసింది. ఆ మేరకు గత వారం 71 జిల్లాలకు అధ్యక్షులు నియమించారు. ఇందులో ఆరేడుగురు తప్పా, మిగిలిన వారంతా కొత్త వారే, ఈసారి మహిళకు సైతం అధ్యక్ష పదవి అప్పగించారు. ఈ పరిస్థితులలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు అంటూ ఇతర కమిటీలకు ప్రతినిధిల ఎంపిక కసరత్తు వేగవంతం చేశారు. రెండు లేదా మూడు రోజులలో ఈ జాబితాను ఢిల్లీకి పంపించే దిశగా టీఎన్‌సీసీ వర్గాలు కసరత్తులు చేపట్టారు. ఈసారి 150 మందితో రాష్ట్ర స్థాయి కమిటీ పదవులు భర్తీ చేయబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే జిల్లా కమిటీలలోని ఇతర పదవుల భర్తీ జాబితాను సిద్దం చేసి ఉన్నారు. ఈ రెండు జాబితాలను ఏఐసీసీ ఆమోదంతో వారం రోజులలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పదవులు కీలకం కావడంతో కీలక పదవుల కోసం టీఎన్‌సీసీలో జాతీయ స్థాయిలో పైరవీలు మొదలైనట్టుగా చర్చ ఊపందుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరీశ్ చోదన్కర్ నేతృత్వంలోని కమిటీని ప్రసన్నం చేసుకుని పదవులను దక్కించుకునేందుకు నేతలు కుస్తీ మొదలెట్టి ఉండడం గమనార్హం.


