తిరువళ్లూరులో ఆగిన డబుల్ డెక్కర్ రైలుకు స్వాగతం
తిరువళ్లూరు: ఏళ్ల తరబడి పోరాటం చేసిన తిరువళ్లూరు రైలు ప్రయాణికులకు కోరిక మేరకు తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌లో చైన్నె–బెంగుళూరు( డబుల్ డెక్కర్ ) రైలు ఆగిన క్రమంలో బీజేపీ నేతలు పూలు చల్లి స్వాగతం పలికారు. వివరాలు.. జిల్లా కేంద్రమైన తిరువళ్లూరు నుంచి బెంగుళూరుకు నిత్యం వేలాది మంది ప్రయాణికులు రైలు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో తిరువళ్లూరు నుంచి బెంగుళూరు, హోసూరు, కాట్పాడి, జోలార్‌పేట తదితర ప్రాంతాలకు డబుల్ డెక్కర్ రైలు ద్వారా వెళ్లే ప్రయాణికులు అరక్కోణం, చైన్నెకు వెళ్లి రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలో రైలు ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైలు తిరువళ్లూరులో ఆగి వెళ్లేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు వినతి పత్రం అందజేయడంతో పాటూ పోరాటాలను చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల పోరాటాన్ని గుర్తించిన రైల్వేశాఖ డబుల్ డెక్కర్ రైలు తిరువళ్లూరులో జనవరి 26 నుంచి ఆగి వెళ్లేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం తిరువళ్లూరులో డబుల్ డెక్కర్ రైలు మొదటి సారి ఆగి వెళ్లడంతో బీజేపీ జిల్లా కార్యదర్శి, సంప్రదింపుల కమిటీ సభ్యుడైన పన్నీర్‌సెల్వం ఆధ్వర్యంలో పూవ్వులు చల్లి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశ్విన్‌కుమార్, ఓబిసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, జిల్లా ఉపాధ్యాక్షుడు బాలాజీ, ఆర్థిక విభాగం జిల్లా అధ్యక్షుడు సతీష్, నేతలు రవికుమార్, ఉమామహేశ్వరి, చిత్రదేవి, రాకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


