వైభవంగా కన్యకా పరమేశ్వరి గర్భగుడి నిర్మాణ పూజలు
కొరుక్కుపేట: టీకేకేఎన్‌ఎన్ వైశ్య ఛారిటీస్ 200వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించాలని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆదివారం శ్రీకన్యకా పరమేశ్వరి గర్భగుడి నిర్మాణ పూజలను వైభవంగా నిర్వహించింది. 108 దివ్యదేశాల్లో ఒకటైన ట్రిప్లికేన్లో తెలుగువారి మూలాలున్న పార్థసారిథి స్వామి ఆలయ సమీపంలో సుంకువార్ వీధిలోవున్న అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఈ నిధులతో ఆదివారం ఉదయం 9.50 నుంచి 11.40 గంటలలోపు శుభలగ్నంలో శంకుస్థాపనం, యంత్రస్థాపనం, నవరత్నాల స్థాపనం, పంచలోహ స్థాపనాలను సంప్రదాయబద్ధంగా వేదపండితులు నిర్వహించారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అద్దంకి నాగకుమార్, తెల్లాకుల నాగేంద్రన్, జె.వెంకటకృష్ణన్, అవ్వా అశోక కుమార్, ఎ.బాలాజీ, టెంపుల్ కమిటీ సభ్యులు అద్దంకి నాగసురేష్, డి.నరసింహన్, ఫైనాన్స్ కమిటీ టీజీ శ్రీనివాసన్, చేగు భక వత్సల గిరి, మాజీ అధ్యక్షులు పి.ఈశ్వరగుప్తా, వైశ్య ప్రముఖులు ఎంవీ నారాయణగుప్తా, మహేంద్రగుప్తా, మన్నారు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.


