భాషోద్యమ వీరులకు నివాళి
మూలకొత్తలం, ఎగ్మూర్‌లో సీఎం అంజలి తాల ముత్తు, నటరాజన్‌ల విగ్రహాల ఆవిష్కరణ హిందీకి చోటులేదని స్పష్టం
సాక్షి, చైన్నె: భాషోద్యమంలో అమరులైన వీరులకు సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటూ మంత్రులు ఆదివారం నివాళులర్పించారు. మూల కొత్తలం, ఎగ్మూర్‌లో భాషా ఉద్యమంలో అమరులైన తాలముత్తు, నటరాజన్ స్మారక చిహ్నాం, విగ్రహాలను ఆవిష్కరించారు. వివరాలు..
1938లో హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో అతిపెద్ద నిరసన ఉద్యమం జరిగింది. 8వ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా తీసుకు రావడంతో రగిలిన ఈ ఉద్యమం అప్పట్లో ఆత్మ గౌరవ సమస్యగా మారింది. ఎ.డి. పన్నీర్ సెల్వం, పెరియార్, మరైమలై అడిగలర్, నవలా రచయిత సోమసుందర భారతియార్, కె.ఎస్. పిళ్లై, పూర్ణలింగనార్, మీనాంబాల్ శివరాజ్, ఇలం తడిగల్, పట్టుకోట్టై అళగిరి, ఎం. తారుమాంబాల్, కంచి మణి మొదలియార్, కవి అరుణగిరినాథర్, విప్లవ కవి భారతీదాసన్, అన్నా వంటి గొప్ప పండితులు, నాయకులు హిందీకి వ్యతిరేకంగా భాషా ఉద్యమం ఏడాదిన్నర కాలం పాటూ కొనసాగింది.
ఈ ఉద్యమంలో వేలాది మంది యువత జైలుపాలయ్యారు. ఈ ఉద్యమంలో చైన్నె పెరంబూర్ పన్నైక్కార ఆండియప్పన్ వీధిలో నివసించే నటరాజన్ తనను అంకితం చేసుకుని ఆస్పత్రిలో మరణించారు. అలాగే, తంజావూరుకు చెందిన తాలముత్తు సైతం కన్నుమూశాడు. భాషా ఉద్యమంలో నటరాజన్, తాలముత్తుల కీర్తిని తమిళులు తమ హృదయాలలో చెరగని ముద్రగా వేయించుకున్నారు. హిందీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అశువులైన వారిని అమర వీరులుగా స్మరిస్తూ ఏటా జనవరి 25వ తేదిన తమిళ భాషా అమర వీరుల దినోత్సవంగా అనుసరిస్తున్నారు.
అమరవీరులకు నివాళులు
చైన్నె మూల కొత్తలంలో నటరాజన్, తాల ముత్తు స్మారకంగా ప్రత్యేక స్తూపం ఏర్పాటు చేశారు. గత ఏడాది దీనిని పునరుద్దరించి, ఆ ఇద్దర విగ్రహాల ప్రతిష్టకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ఎగ్మూర్ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆదివారం అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం స్టాలిన్ నేతృత్వంలో మౌన ర్యాలీ జరిగింది. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ త నల్ల వస్త్రాలను ధరించి అడుగులు వేశారు. మూల కొత్తలంలోని స్మారక ప్రదేశంలో అంజలి ఘటించారు. ఎగ్మూర్‌లోని తాళ ముత్తు, నటరాజన్‌ల విగ్రహాలను ఆవిష్కరించారు. నాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ వీర వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ, తమిళనాడులో నాడు, నేడు, రేపు..ఎన్నటికీ హిందీకి చోటు అన్నది లేదని స్పష్టం చేశారు. ఇక, భాషోద్యమంలో ఒక్క ప్రాణం కూడా బలయ్యేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. తమిళుల మనో భావాలు ఎన్నటికి అజరామరం అని వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు స్వామినాథన్, ఎం సుబ్రమణియన్, శేఖర్‌బాబు, మేయర్ ఆర్ ప్రియ, ఎమ్మెల్యేలు సుదర్శనం, తాయకంకవి, ఆర్.టి. శేఖర్, జోసెఫ్ శామ్యూల్, వెట్రి అళగన్, ఐడ్రీమ్స్ మూర్తి, కె.పి. శంకర్, కె. గణపతి, అరవింద్ రమేష్, ఎ.ఎం.వి. ప్రభాకర్ రాజా, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కాకర్ల ఉషా, సీఎండీఏ సభ్య కార్యదర్శి కె ప్రకాష్, చైన్నె కార్పొరేషన్‌కమిషనరన్ కుమర గురుబరన్ పాల్గొన్నారు.
భాషోద్యమ వీరులకు నివాళి


