క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jan 26 2026 4:49 AM | Updated on Jan 26 2026 4:49 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

మృతిచెందిన సేలం విద్యార్థిని

కుటుంబానికి సాయం

– సీఎం స్టాలిన్‌ ప్రకటన

తిరువొత్తియూరు: సేలం జిల్లా, తలవాసల్‌ సర్కిల్‌, సదాశివపురం గ్రామం, అరిజ్ఞర్‌ అన్నా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కృష్ణగిరి జిల్లా, హోసూర్‌ రాయకోట్టైకి చెందిన దివ్యదర్శిని (17) తోటి విద్యార్థులతో ఫుట్‌బాల్‌ ఆడుతుండగా అనుకోకుండా స్పృహతప్పి పడి పోయి చికిత్స నిమిత్తం ఆత్తూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈనేపథ్యంలో సీఎం స్టాలిన్‌ ఆదివారం ఓ పకటనలో సీఎం పబ్లిక్‌ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.3 లక్షలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రక్తస్రావ నిరోధక మందు

నాణ్యత నిర్ధారణ పరీక్షపై పిటిషన్‌

కొరుక్కుపేట: గాయాలకు పూసే పెరాక్రిల్‌ జల్‌కు పూర్తిస్థాయి నాణ్యత నియంత్రణ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలు.. మహారాష్ట్రకు చెందిన కెమికల్‌ ఇంజినీర్‌ వినయ్‌ ఆనంద్‌ జీవేకర్‌ తరపున న్యాయవాది ఎం. హరిస్‌కుమార్‌ దాఖాలు చేసిన పిటిషన్‌లో పెరాక్రిల్‌ జెల్‌ అనేది మంటను నియంత్రించడానికి, గాయాలు త్వరగా మానడానికి ఉపయోగించే ఓ క్రిమినాశక మందు. దీనికి రక్తం గడ్డకట్టడాన్ని వేగవంతం చేసే ఇన్ఫెక్షన్‌ నివారించే లక్షణం ఉంది. దీనిని రాపిడి, కోతలు, కాలిన గాయాలు దంత శస్త్రచికిత్సలకు ఉపయోగిస్తారు. ఈ ఔషదాన్ని కఠినమైన నాణ్యత పరీక్షల తర్వాతే మార్కెట్‌ చేయాలి. కాబట్టి పూర్తి పరీక్ష తర్వాతే ఈ ఔషధానికి అనుమతి ఇవ్వాలని ఆయింట్‌మెంట్‌ను అమ్మకం నుండి ఉపసంహరించుకోవాలని తమిళనాడు ఆరోగ్యశాఖను ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎం.శ్రీవాస్తవ, జస్టిస్‌ జి. అరుళ్‌ మురుగన్‌, తమిళనాడు ఆరోగ్య శాఖ, డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌తో కూడిన ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.

హత్య కేసులో

నలుగురి అరెస్ట్‌

తిరువొత్తియూరు: కార్మికుడి హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. తిరుచ్చి జిల్లా పుత్తాదంతం సమీపంలోని కావల్కారన్‌పట్టికి చెందిన సుబ్రమణియన్‌ (51) కార్మికుడు. గత 19వ తేదీ రాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. పుత్తానత్తం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు విచారణలో కావల్కారన్‌పట్టికి చెందిన బాలికను రాధాకృష్ణన్‌ (22) గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. విషయం తెలిసి శివసుబ్రమణియన్‌ అతని బంధువులు వెళ్లి ఆ బాలికను మందలించారు. దీనికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. దీంతో రాధాకృష్ణన్‌ను పిలిచి విచారించగా, బాలికతో ప్రేమను వదులుకోవాలని శివసుబ్రమణియన్‌ ఒత్తిడి చేయడంతో కోపంతో అతన్ని హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. అలాగే శివసుబ్రమణియన్‌న్‌ను హత్య చేయడానికి రాధాకృష్ణన్‌ ప్రేయసి ప్రోత్సహించినట్లు, రాధాకృష్ణన్‌ తమ్ముడు చేరన్‌, కావల్కారన్‌పట్టికి చెందిన శివనేససెల్వన్‌ (19) రాధాకృష్ణన్‌ పారిపోవడానికి సాయం చేసినట్లు తెలిసింది. రాధాకృష్ణన్‌, బాలిక, చేరన్‌, శివనేససెల్వన్‌ నలుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్‌

– తప్పిన పెనుప్రమాదం

పళ్లిపట్టు: ఇంట్లోకి టిప్పర్‌ దూసుకెళ్లిన ప్రమాదంలో అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పళ్లిపట్టు ప్రాంతంలోని క్వారీల నుంచి టిప్పర్లలో ఎం సాండ్‌, గ్రావెల్‌, చిప్స్‌ తరలిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో పాటు రాత్రి సమయాల్లో వాహనాలు నడపడంతో నొచ్చిలి, కేజీ కండ్రిగ జిల్లా రహదారిలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ క్రమంలో ఆదివారం వేకువజామున పళ్లిపట్టు నుంచి తిరుత్తణి వెళుతున్న టిప్పర్‌ అదుపుతప్పి యూఆర్‌ఆర్‌ కండ్రిగ వద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాలను ఢీకొని పక్కనే వున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈఘటనలో మూడు విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఇంటి ముందు భాగం దెబ్బతింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్కేపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాసిమేడ్‌లో పెరిగిన చేపల ధర

కొరుక్కుపేట: వర్షాలు కారణంగా చేపల సరఫరా గణనీయంగా తగ్గింది. ఫలితంగా సముద్ర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. వివిధ రకాల చేపలు, రొయ్యలు, ఆంకోవీస్‌, పీతలు ధరలు సాధారణం కంటే రూ. 100 నుంచి రూ.200 వరకు ఎక్కువగా పలికారు. ఆదివారం ఉదయం నుండి చైన్నె దాని శివారు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చేపలు కొనడానికి కాసిమేడ్‌కి వచ్చే ప్రజలు, వ్యాపారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తగినంత ఉత్పత్తులు కూడా లేకపోవడంతో సెలవు దినం రోజున ఎక్కువ ధరకు అమ్ముడైనట్లు వ్యాపారుల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement