పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు కలుషితం
పళ్లిపట్టు: జంగాళపల్లెలో పైపులైన్లు లీకేజీతో తాగునీరు పేరుకుపోవడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. పళ్లిపట్టు యూనియన్‌లోని జంగాళపల్లె గ్రామంలో గ్రాంథాలయం, సహాయ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చౌక దుకాణం పరిసర ప్రాంతంలో పంచాయతీ ద్వారా 60 వేల లీటర్ల సామర్థ్యం వున్న ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకు ఉంది. ట్యాంకు నుంచి పైపు లైన్లు ద్వారా గ్రామీణులకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకు పైపు లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా ట్యాంకు కింద భాగంతో పాటూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద పేరుకుపోతోంది. ఈ క్రమంలో ఇటీవల అదే ప్రాంతంలోని మినీ ట్యాంకును అధికారులు కూల్చి వేశారు. ఈ సందర్భంగా పైపులైన్ ధ్వంసం కావడంతో తాగునీరు నిల్వ ఉంటోంది. రోజుల తరబడి తాగునీరు పేరుకుపోవడంతో అందులో దోమలు వ్యాపించి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో రోజూ చౌక దుకాణం, గ్రంధాలయం, ఆరోగ్యకేంద్రానికి వచ్చి వెళ్లే గ్రామీణులు అవస్థలు పడుతున్నారు. పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరిచి తాగునీరు నిల్వ చేరకుండా పైపులైన్లు మార్చాలని స్థానికులు కోరారు.
పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు కలుషితం


