కవులకు మార్గదర్శకుడు పింగళి
కొరుక్కుపేట: తెలుగు సినిమా రచనలో సరికొత్త ఒరవడిని ప్రవేశపెట్టి, అనేకమంది కవులకు మార్గదర్శకుడైన విశిష్ట రచయిత పింగళి నాగేంద్రరావు అని ప్రముఖ రచయిత, గాయకులు డా. వివి రామారావు కొనియాడారు. వేద విజ్ఞాన వేదిక చైన్నె ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధోరణిలో భాగంగా 169వ ప్రసంగ కార్యక్రమం ఆదివారం సాయంత్రం టీ.నగర్ ఆంధ్రా క్లబ్లోని కృష్ణా హాల్లో జరిగింది. పింగళి సినీ సాహిత్య సౌరభం అనే అంశంపై డాక్టర్ వివి రామారావు ప్రసంగం చేశారు. ఆంధ్రకవిత్వంలో నన్నయ, తిక్కన, ఎర్రనతో తెలుగు సినీ కవిత్రయంలో సముద్రాల, మల్లాది, పింగళిలను పోల్చవచ్చన్నారు. తెలుగు పాట ఎలా రాయాలో, ఎలా రాయకూడదో తెలిసిన విజ్ఞుడు పింగళి. శ్రీపాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి చిత్రాల ద్వారా ఆయన కథా కల్పనలో, సంభాషనలలో, గీత సృజనలో నవ్యతను సాధించారు. ఆయన సృస్టించిన వింతైన పేర్లు (అరమతి కాలమతి, త్రిశోకానందుడు), మాటలు (సాహసం చేయ రా డింభక, అస్మదీయులు – తస్మదీయులు, హైహై నాయక) నేటికీ సజీవంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పింగళి రాసిన మధుర గీతాలను గుర్తు చేశారు. ‘కలవరమాయో మది లో’ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘మనసు పరిమళించెలే’ వంటి పాటలను ఆలపించి సభాసదులను అలరించారు. కార్యక్రమంలో వేద విజ్ఞాన వేదిక సంస్థఅధ్యక్షుడు జేకె రెడ్డి, కార్యదర్శి కందనూరు మధు తదితరులతో కలిసి వక్తను జ్ఞాపికతో సత్కరించారు.


