రెండోరోజూ కొనసాగిన సర్వేయర్ల నిరసన
తిరువళ్లూరు: దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు సర్వేయర్‌ల సంఘం ఆధ్వర్యంలో సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఈక్రమంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎం. సెంధిల్‌కుమరన్ అద్యక్షత వహించారు. జిల్లా జాయింట్ సెక్రెటరీ శరత్‌కుమార్, కార్యదర్శి యశ్వందర్‌దాస్, ఉపాధ్యాక్షురాలు విధ్య తదితరులు ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యఅతిథిధిగా తమిళనాడు రెవెన్యూ ఉద్యోగులు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మణిగండన్, తమిళనాడు గ్రామీణభివృద్ధి ఉద్యో గులు సంఘం రాష్ట్ర అద్యక్షుడు గాంధిమధినాథన్, తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇళంగోవన్, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు యోగరాజ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా సెంథిల్‌కుమరన్ మాట్లాడుతూ సర్వేయర్‌లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ల మధ్య వున్న వేతన వ్యత్యాసాలను సరి చేయాలని డిమాండ్ చేశారు. సర్వేయర్ విభాగంలో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా వున్న సర్వేయర్‌ల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌లను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి నిరవదిక సమ్మె చేస్తున్నట్టు వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పలువురు సర్వేయర్‌లు, సంఘం నేతలుపెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా సర్వేయర్ల సమ్మెతో ఇంటి పట్టాలు మార్పు, సబ్‌డివిజన్ పట్టాలు, భూసర్వే ప్రక్రియ పూర్తీగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ప్రభుత్వం స్పందించి సమ్మెలో ఉన్న సర్వేయర్‌లతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.


