బీఎల్‌ఓలకు దరఖాస్తుల అందజేత
పళ్లిపట్టు: ప్రత్యేక సమగ్ర సవరణ దరఖాస్తులు పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందజేయడంలో రాజకీయ పార్టీల శ్రేణులు ఓటర్ల సహకారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) దరఖాస్తులు పూర్తిచేసి ఆయా ప్రాంతాల్లోని బీఎల్‌ఓకు అందజేయాలని ఎన్నికల సంఘం నవంబర్ 30 వరకు అవకాశం కల్పించింది. పైగా సోమవారం నుంచి బుధవారం వరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు పూర్తిచేసి అందజేయాలని సూచించింది. దీంతో ఆ ప్రాంతాల్లో పార్టీల శ్రేణులు ఓటర్లకు తమవంతు సాయం అందజేసి ఓటర్ల దరఖాస్తులు నింపి సహాయపడుతున్నారు. పళ్లిపట్టు మండల డీఎంకే కార్యదర్శి రవీంద్ర ఆధ్వర్యంలో బొమ్మరాజుపేటలో ఓటర్లకు సర్ ఓటర్ల దరఖాస్తులు పూర్తిచేసేందుకు డీఎంకే శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. దరఖాస్తులు పూర్తిచేసేందుకు తెలియని నిరక్ష్యరాసులతో పాటు మహిళలు, వృద్ధులకు డీఎంకే శ్రేణులు అండగా వుంటూ దరఖాస్తులు పూర్తి చేసి తమవంతు సాయం చేశారు. అదేవిధంగా పళ్లిపట్టు మండలంలోని పలు ప్రాంతాల్లో డీఎంకే శ్రేణులు దరఖాస్తులు పూర్తి చేసేందుకు సాయపడ్డారు.


