డాక్టర్లే రియల్ హీరోలు
సాక్షి, చైన్నె: ప్రజల ప్రాణాలను రక్షించడంలో డాక్టర్లే రియల్ హీరోలు అని సినీనటుడు రవి మోహన్ వ్యాఖ్యానించారు. ప్రీమెచ్యూరిటీ పిల్లలను హేళన చేయవద్దు అని కోరారు. క్రోంపేటలోని రేలా ఆస్పత్రిలో తక్కువ నెలలలో జన్మించిన 50కి పైగా శిశువులు, వారి కుటుంబాలకు ఏకం చేస్తూ ప్రీమెచ్యూరిటీ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ వేడుకకు నటుడు రవి మోహన్ హాజరయ్యారు. నవజాత శిశువులతోకాసేపు గడిపారు. ఆ పిల్లలను ఎత్తుకుని లాలించారు. తక్కువ నెలలతో జన్మించిన తమ పిల్లలను రక్షించేందుకు వైద్యులు పడ్డ శ్రమ, వారి కృషిని ఈసందర్భంగా అనేక మంది తల్లిదండ్రులు అభినందిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈసందర్భంగా రవి మోహన్ మాట్లాడుతూ, ఇంత మంది పిల్లలను రక్షించడంలో వైద్యులు పడ్డ శ్రమను చూస్తుంటే, వాళ్లే రియల్ హీరోలు అని వ్యాఖ్యలు చేశారు. తక్కువ నెలలతో పుట్టిన పిల్లలను ఎవ్వరూ హేళన చేయవద్దు అని కోరారు. తాను కూడా ఇకౖపై సినిమాలలో ఇలాంటి సన్నివేశాలకు సంబంధించిన వ్యతిరేక డైలాగులు ఉంటే వాటిని పక్కన పెడుతానని వ్యాఖ్యలు చేశారు. నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ, అవగాహనలో తాను సైతం భాగస్వామ్యం అవుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రేలా ఆస్పత్రి చైర్మన్ ప్రొఫెసర్ మహ్మద్ రేలా, శిశుఆరోగ్య డైరెక్టర్ డాక్టర్ నరేష్ షన్ముగం, సీనియర్ వైద్యులు వేల్ మురుగన్, ఎంపీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


