అతిసారంతో 30 మందికి చికిత్స
పళ్లిపట్టు: పళ్లిపట్టు టౌన్‌లో తాగునీరు కలుషితం కావడంతో అతిసారం ప్రబలి 30 మందికి వాంతులు, విరేచనాలు రావడంతో ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నారు. పళ్లిపట్టు టౌన్ పంచాయతీలోని ఆంజనేయనగర్, రాధానగర్, సాలియర్ వీధి, ఈచ్చంపాడి ప్రాంతాల్లో చిన్నారుల నుంచి మహిళలు సహా 30 మందికి వరుస క్రమంలో వాంతులు, విరేచనాలు చోటుచేసుకున్నాయి. దీంతో వారందరూ పళ్లిపట్టు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురికి పరిస్థితి విషమించడంతో తిరువళ్లూరు, చైన్నె ప్రభుత్వాస్పత్రులకు తరలించి చికిత్స పొందుతున్నారు. దీంతో ఆప్రమత్తమైన మండల వైద్యాధికారి ధనంజయన్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో అతిసారం ప్రబలిన ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య పరీక్షలతో పాటు మాత్రలు పంపిణీ చేశారు. అలాగే పట్టణ పంచాయతీల డిప్యూటీ డైరెక్టర్ జయకుమార్, ఈఓ రాజకుమార్ బృందం తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయించి కొళాయిల్లో సమస్య చోటుచేసుకున్న ప్రాంతాల్లో పైపులైన్లు మార్చే పనులు చేశారు. వెంటనే తాగునీటి సరపరా ఆపేసి ట్రాక్లర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. బుధవారం పరిస్థితి అదుపులోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే చంద్రన్ పరామర్శించారు.


