జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటిన తమిళనాడు జట్టు
కొరుక్కుపేట: తమిళనాడు స్పెషల్ పోలీస్ ఫోర్స్ 13వ జట్టుగా ఉన్న తమిళనాడు మటిలా డిజాస్టర్ రెస్పాన్స్ టీం సత్తాచాటింది. ఈ జట్టు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన 2025 జాతీయ స్థాయి కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ డిజాస్టర్ రెస్పాన్స్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. వివరాలు.. తమిళనాడు విపత్తు ప్రతిస్పందన దళం (టి ఎన్ డి ఆర్ ఎఫ్) కు చెందిన 24 మంది సభ్యుల బృందం అదనపు డీజీపీ దినకరన్ ఆదేశాల మేరకు అయ్యాస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శిక్షణ నిర్వహించింది . అసిస్టెంట్ మణిమారన్ నేతృత్వంలో ఇద్దరు సబ్–ఇన్స్పెక్టర్లు , 18 మంది పోలీసు అధికారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. దీని తరువాత, ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో, తమిళనాడు విపత్తు ప్రతిస్పందన దళం విజేత జట్టుకు హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం డైరెక్టర్ జనరల్ పియూష్ ఆనంద సమక్షంలో ట్రోఫీని అందుకుంది. తమిళనాడు విపత్తు ప్రతిస్పందన దళం తరపున అదనపు డీజీపీ డాక్టర్ ఐ. దినకరన్ ట్రోఫీని స్వీకరించారు. తమిళనాడు విపత్తు ప్రతిస్పందన దళం సాధించిన ఈ విజయాన్ని డీజీపీ వెంకటరామన్ ప్రశంసించారు.
ముగ్గురు ట్రైనీ వైద్యుల దుర్మరణం
– మరో ఇద్దరి పరిస్థితి విషమం
అన్నానగర్: రోడ్డుప్రమాదంలో తూత్తుక్కుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో శిక్షణ వైద్యులుగా ఉన్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లాకు చెందిన శరణ్ (24), కురుంబేరి మందైవేలి తాలూకా నివాసి శ్రీనివాసన్ కుమారుడు ముగిలన్ (23), పుదుక్కోట్టై జిల్లాకు చెందిన పరిసుత్తమాన్ కుమారుడు రాహుల్ జెబస్తియన్ (23), కోవై కి చెందిన సుందర్ రాజ్ కుమారుడు సారూబన్(23) తూత్తుకుడిలోని థర్మల్‌నగర్ ఎన్.డి.పి.ఎల్ ప్రాంతానికి చెందిన రవికుమార్ కుమారూడు క్రిత్తికుమార్ (23) వీరు బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తూత్తుకుడిలోని న్యూ పోర్ట్ బీచ్ రోడ్డులోని రోస్ పార్క్ సమీపంలో కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో భారీ వర్షం కారణంగా, అతివేగంగా ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. కారులో ఉన్న 5 మంది ట్రైనీ వైద్యులు నుజ్జునుజ్జు అయ్యారు. ఆ ప్రమాదం గురించి ఆ దారిలో వెళుతున్న మత్స్యకారులు వెంటనే 108 అంబులెన్స్, అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తూత్తుకుడి నగర పోలీసు మధన్ , తెన్పాగం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖకు చెందిన ఇతరులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాహుల్ జెబాస్టియన్, సారూబన్ అక్కడికక్కడే విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ముగిలన్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కృతికుమార్, శరణ్ లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో
అర్జీల స్వీకరణ
కొరుక్కుపేట: చైన్నె పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో మహిళలు, వృద్ధులతో సహా 12 మంది నుంచి పోలీస్ కమిషనర్ అరుణ్ నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. వివరాలు.. చైన్నెలోని వేపేరిలో ఉన్న చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రతి బుధవారం ప్రజా ఫిర్యా దుల పరిష్కార శిబిరం నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం, బుధవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరానికి పోలీస్ కమిషనర్ అరుణ్ హాజరయ్యారు. మహిళలు, వృద్ధులు మొత్తం 12 మంది నుంచి విడివిడిగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను ఆయన విన్నారు. తరువాత వచ్చిన అర్జీలపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అరుణ్ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సీత పాల్గొన్నారు.
పోలింగ్ సిబ్బంది
వేతనాల పెంపు
సాక్షి, చైన్నె: ఓటరు జాబితా తయారీ, సవరణ, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ సిబ్బందికి జీతాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల విధులలో పాల్గొనే పీఎస్‌ఓలు, పోలీంగ్ కేంద్రం అధికారుల జీతాలను పెంచారు. ఈ మేరకు పీఎల్‌ఓల వార్షిక జీతం రూ. 6 వేల నుంచి రూ. 12 వేలకు పెంచారు. సూపర్ వైజర్ల జీతం రూ. 12 వేల నుంచి 18 వేలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చారు.


