కోడిగుడ్ల వ్యాన్ బోల్తా
పళ్లిపట్టు: టైరు పేలి వ్యాన్ బోల్తా పడిన ఘటనలో రూ.3లక్షల విలువైన 65వేల కోడిగుడ్లు నేలపాలయ్యాయి. తిరుత్తణిలోని అరక్కోణం రోడ్డులో నాగరాజన్ అనే వ్యక్తి కోడిగుడ్ల హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నారు. అతనికి చెందిన వ్యాన్ చిత్తూరు జిల్లాలోని కోళ్లఫారం నుంచి 65 వేల కోడిగుడ్లు లోడ్ వేసుకుని వ్యాన్ తిరుత్తణికి బుధవారం బయలుదేరింది. వ్యాన్‌ను తిరుత్తణికి చెందిన పళని నడిపాడు, పళ్లిపట్టు సమీపం ఆర్కేపేట రహదారిలో అత్తిమాంజేరిపేట వద్ద వ్యాన్ వెళుతుండగా అకస్మాత్తుగా ముందు టైర్ పేలి వ్యాన్ బోల్తా పడింది. ఈప్రమాదంలో వ్యాన్‌లోని కోడిగుడ్లు పగిలి రోడ్డుపై పడడంతో దుర్వాసన చోటుచేసుకుంది. దీంతో ట్రాఫిక్ సమస్య చోటుచేసుకోవడంతో పొదటూరుపేట పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకుని బోల్తాపడ్డ వ్యాన్‌ను పక్కకు తీసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వ్యాన్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


