ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, చైన్నె: తన ప్రేమను నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్లస్‌టూ చదువుతున్న విద్యార్థినిని అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటనతో ఆ ప్రేమోన్మాదిపై గ్రామస్తులు ఆక్రోశంతో రగిలి పోతున్నారు. అతడిని తమకు అప్పగించాలని పోలీసులను గ్రామస్తులు హెచ్చరించారు. బుధవారం ఈ ఘటన రామనాథపురం జిల్లా రామేశ్వరంలో చోటు చేసుకుంది. వివరాలు.. రామేశ్వరానికి చెందిన జాలరి మారియప్పన్‌కు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె షాలిని(17) స్థానికంగా ప్లస్‌టూ (ఇంటర్మిడియట్) చదువుతోంది. బడికి వెళ్లే సమయంలో అదే ప్రాంతానికి చెందిన మునియరాజ్ అనే యువకుడు ఆమెను గత కొంత కాలంగా ప్రేమ పేరిట వేదిస్తూ వచ్చాడు. ఇంట్లో ఈ విషయం చెబితే బడి మానేయమని చెబుతారంటూ తనలో తాను షాలిని కృంగిపోతూ వచ్చింది. ఎట్టకేలకు మునియరాజ్ వేధింపుల విషయం మారియప్పన్ దృష్టికి చేరింది. దీంతో మునియరాజ్‌ను మారియప్పన్ తీవ్రంగా మందలించాడు. మరో మారు పునరావృతమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
ఉన్మాదిగా..
తనను మారియప్పన్ మందలించడంతో తీవ్ర ఆగ్రహానికి మునియ రాజ్ లోనయ్యాడు. బుధవారం ఉదయం స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్తున్న షాలిని అడ్డగించి తనను ప్రేమించాలని, తన ప్రేమను అంగీకరించాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారిన అతడు తన వద్ద ఉన్న కత్తితో కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న స్నేహితులు, పరిసర వాసులు తేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న షాలిని రామేశ్వరం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించడంతో గ్రామస్తులలో ఆగ్రహం బయలు దేరింది. సమాచారం అందుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు విస్తృతం చేశారు. ఎట్టకేలకు అతడిని సముద్ర తీరంలో అరెస్టు చేసి పోర్టు పోలీసు స్టేషన్‌కు తరలించారు. హతురాలి బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రికి వద్దకు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. నిందితుడ్ని తమకు అప్పగించాల్సిందేనని గ్రామస్తులు పోలీసులను హెచ్చరించారు. మరొకరు ఇలాంటి ఘాతుకానికి పాల్పడకుండా ఉండాలంటే నిందితుడికి తామే సరైన శిక్ష విధిస్తామంటూ గ్రామస్తులు ఆక్రోశంతో ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది.
ప్రేమోన్మాది ఘాతుకం


