మదురై, కోవై మెట్రో సాధిస్తాం..!
సాక్షి, చైన్నె : మధురై, కోయంబత్తూరులలో మెట్రో రైలు ప్రాజెక్టులను సాధించి తీరుతామని సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. చైన్నెలో సాగుతున్న మెట్రో రైలు సేవల గురంచి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించే విధంగా సాధ్యా అసాధ్యాల నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మదురై, కోయంబత్తూరులో మెట్రోరైలు ప్రాజెక్టుల కోసం సిద్ధం చేసిన నివేదిలను కేంద్రం ప్రభుత్వానికి ఇటీవల పంపించారు. కోయంబత్తూరులో 39 కి.మీ దూరం సేవలకు గాను రూ. 10,740 కోట్లతో పనులకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో రూ.1,082 కోట్లు భూ సేకరణకు, పునరావాస ఖర్చులకు రూ. 40.34 కోట్లుగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం వాటాగారూ. 1443 కోట్లు అంచనా వేశారు. అలాగే మధురైలో 31.93 కి.మీ దూరానికి రూ.11,368 కోట్లుగా అంచనా వేశారు. అయితే, ఈ నివేదికలు వెనక్కి రావడం చర్చకు దారి తీశాయి. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ ఎక్స్ పేజీలో స్పందిస్తూ ప్రతి పక్ష పార్టీల పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి పనులను కేంద్రం అడ్డుకుంటున్నదని ధ్వజ మెత్తారు. చైన్నెలో జరుగుతన్న మూడు మార్గాలలో పనులకు నిధులను విడుదల చేయడం లేదని మండి పడ్డారు. తాజాగా మదురై, కోయంబత్తూరులలోమెట్రో రైలు ప్రాజెక్టులను అడ్డుకునే పనిలో పడ్డారని, అయినా దీనిని సాధించి తీరుతామని స్పష్టం చేశారు. కాగా ఈ రెండు ప్రాజెక్టులను ఆమోదం తెలపాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వా మి ప్రధాని మోదీకి వినతిపత్రం అందించడం గమనార్హం.


