వినియోగదారులకు అవగాహన కల్పించాలి
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు సోలార్ సెల్ ఉపయోగంపై అవగాహన కల్పించి కనెక్షన్ల శాతాన్ని పెంచాలని తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థ టెక్నాలజీ విభాగం రాష్ట్ర డైరెక్టర్ మంగళనాథన్ అన్నారు. వేలూరులోని ప్రయివేటు హోటల్‌లో తమిళనాడు ఉత్పత్తి, పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో సోలార్ సెల్ సెల్లర్ల రాష్ట్ర స్థాయి మహానాడు బుధవారం ఉదయం జరిగింది. ఇందులో హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. రాష్ట్రంలోనే వేలూరు రీజినల్ అధికంగా కనెక్షన్లు ఉన్నాయన్నారు. వీటిని మరింతగా పెంచేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఈ సోలార్ విద్యుత్ కనెక్షన్‌లను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన లోన్‌లను కూడా బ్యాంకు నుంచి ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సోలార్‌సెల్ ఏజెంట్‌లతో సంయుక్తంగా పనిచేస్తే మరింతగా పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు నూతనంగా ఇల్లు నిర్మించుకొని విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చే వారి వద్ద ఈ పథకంపై అవగాహన కల్పించాలన్నారు. 2027 నాటికి కోటి ఇళ్లకు సోలార్ కనెక్షన్‌లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మహానాడులో అసిస్టెంట్ మేనేజర్ రమేష్‌బాబు, వేలూరు చీఫ్ ఇంజినీర్ రామలింగం, మేనేజర్ లత, వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, క్రిష్ణగిరి జిల్లాలకు చెందిన విద్యుత్ శాఖ ఇంజినీర్‌లు, వివిధ శాఖల అధి కారులు పాల్గొన్నారు.


