రోజా మల్లి కనకాంబరం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
తమిళసినిమా: చాలా మంది దర్శకులు కథానాయకులుగా మారి విజయపదంలో సాగుతున్నారు. అదే పట్టికలో దర్శకుడు కేపీ.జగన్ తన పయనాన్ని ప్రారంభించారు. ఈయన ఇంతకు ముందు పుదియ గీతై, కోడంబాక్కం, రామన్ తేడియ సీతై, ఎన్ ఆలోడ చెరుప్పు కానోమ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా తాజాగా కేపీ.జగన్ హీరోగా మారి, స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి రోజా మల్లి కనకాంబరం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో బిగ్‌బాస్ ఫేమ్ నటుడు విజయ్‌వర్మ, సంగీత కల్యాణ్, పిచ్చైక్కారన్ మూర్తి, దియా, రంజిత్ వేలాయుధన్, వెట్రివేల్ రాజా,దింగుక్కల్ అలెక్స్, ఉరరియడి శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటూ జాతీయ అవార్డు గ్రహీత ఎంఎస్.భాస్కర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఒక సరళరేఖలో పయనించే మూడు కథలతో తెరకెక్కిస్తున్న చిత్రం రోజా మల్లి కనకాంబరం అని చెప్పారు. యదార్ధ ఘటన ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్ర కథనం చాలా కొత్తగా ఉంటుందన్నారు. ఒక్కో కథకు ఒక పాట చోటు చేసుకునే ఈ చిత్రంలో అదనంగా మరో పాటు ఉంటుందని చెప్పారు. ఇది పాటలకు, నేపధ్య సంగీతానికి ప్రాముఖ్యత కలిసిన చిత్రంగా ఉంటుందన్నారు. బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొన విజయ్‌వర్మ ఈ చిత్రంలో ప్రముఖ నటులలో ఒకరుగా నటిస్తున్నారనీ, ఆయనకు జంటగా సంగీత కల్యాణ్ నటిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్‌ను అధికభాగం తిరుచెందూర్, తూత్తుక్కుడి, మణపాడు, కులశేకర పట్టణం ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. చివరి షెడ్యూల్‌ను ఈ నెలలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కాగా ఇంతకు ముందు మాయాండి కుటుంబత్తార్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మునైటెడ్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు చేరన్, విఘ్నేశ్ శివన్ సోమవారం ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్


