వైభవంగా కాలభైరవస్వామి హోమం
తిరుపతి కల్చరల్: కపిలేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శ్రీకాలభైరవ స్వామి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని శ్రీకపిలేశ్వరాలయంలో నెల రోజులు హోమ మహోత్సవాలు చేపట్టారు. ఇందులో భాగంగా యాగశాలలో బుధవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి సమర్పించారు. గురువారం నుంచి నవంబర్ 7 వరకు శ్రీకామాక్షి అమ్మవారి చండీ హోమం నిర్వహించనున్నారు. హోమానికి బుధవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు రూ.500లు చెల్లించి టికెట్ తీసుకోవాలని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


