హార్ట్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయ్
కొరుక్కుపేట : యువ జనాభాలో స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని అపోలో ఆస్పత్రి వైద్యులు అన్నారు. 25 ఏళ్ల పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు స్ట్రోక్ బారిన పడుతున్నట్టు వెల్లడించారు. చైన్నెలోని నుంగంబాక్కంలో అపోలో ఆస్పత్రికి చెందిన అపోలో అడ్వాన్సుడ్ స్ట్రోక్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో స్ట్రోక్‌పై అవగాహన కల్పించారు. నగరమంతటా స్ట్రోక్ రోగులకు వేగవంతమైన రోగ నిర్ధారణ, చికిత్సను నిర్ధారించడానికి రూపొందించబడిన సమగ్రమైన, ప్రోటోకాల్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్టు అపోలో వైద్యులు వెల్లడించారు. అపోలో ఆస్పత్రి చైన్నె రీజియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఇళన్ కుమరన్ మాట్లాడుతూ 25 ఏళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారని, యువ జనాభాలో స్ట్రోక్ కేసులు ఎక్కువగా వస్తున్నందున, స్ట్రోక్ కేర్‌లో ముందస్తు గుర్తింపునకు అపోలో హాస్పిటల్స్ స్ట్రోక్ నెట్‌వర్క్ ప్రారంభించినట్టు తెలిపారు. చైన్నెలోని గ్రీమ్స్‌లేన్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో న్యూరో ఎండోవాస్కులర్ సర్జరీ హెడ్ డాక్టర్ శ్రీనివాసన్ పరమశివం, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని స్ట్రోక్ పై అవగాహన కల్పించారు.


