
ఆనందోత్సాహాలతో.. దీపావళి
రాష్ట్రవ్యాప్తంగా సందడే సందడి
రూ. 7 వేల కోట్ల వరకు బాణసంచా అమ్మకాలు
రూ.789 కోట్లకు మద్యం విక్రయాలు
నిబంధనలు ఉల్లంఘించిన 319 మందిపై కేసులు
వందలాది మందికి గాయాలు
చైన్నెలో పేరుకు పోయిన చెత్త
పెరిగిన కాలుష్యంతో విమాన సేవలకు ఆటకం
రాష్ట్ర ప్రజలు దీపావళి పండుగను సోమవారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పండుగ వేళ వర్షం కొన్ని చోట్ల పడ్డ, మరికొన్ని చోట్ల తెరపించడంతో బాణసంచా విక్రయాలు భారీగానే జరిగాయి. అలాగే వస్త్రాలు, స్వీట్లు, మాంసం అమ్మకాలు కూడా పెద్దఎత్తున సాగాయి. మొత్తం మీద రూ. 7 వేల కోట్ల వరకు టపాకాయల విక్రయం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా అమ్మిన, కాల్చిన వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి.
సాక్షి, చైన్నె: దీపావళి పర్వదినం రోజున రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. ప్రజలు తలంటు స్నానాలు, కొత్తబట్టలు, పిండి వంటలు, స్వీట్ల పంపకాలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఇక చైన్నె శివారులోని మహాబలిపురంతో పాటూ పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో విదేశీయులు దీపావళి సంబరాలలో భాగస్వాములయ్యారు. సినీ సెలబ్రటీలు తమ తమ కుటుంబాలతో పండుగను జరుపుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు బాణసంచా మోతను హోరెత్తించారు. కొన్నిచోట్ల వర్షం అంతరాయం కలిగించినా.. ఈ ఏడాది బాణసంచా విక్రయాలు జోరుగానే జరిగాయి. కొందరు అయితే, నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా బాణసంచా పేల్చడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. కోయంబత్తూరు, తేని జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా టపాకాయలు రహితంగా పండుగను జరుపుకున్నారు. ఇక బాణసంచా మోతతో చెత్తతో పాటూ వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. చైన్నెలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుంగుడి, ఆలందూరు పరిసరాలలో అమాంతంగా గాలిలో కాలుష్యం పెరిగింది. రోడ్లు కనిపించక పోవడంతో వానహదారులు అవస్థలు పడాల్సి వచ్చింది. చైన్నెలో 15 విమాన సేవలకు తీవ్ర ఆటంకం కలుగడంతో సేవలు ఆలస్యంగా జరిగాయి. బాణ సంచాతో పేరుకు పోయిన చెత్తను తొలగించేందుకు మంగళవారం ఉదయాన్నే చైన్నెలో 5 వేల మంది సిబ్బంది రంగంలోకి దిగారు. చైన్నెలోని 34 వేల వీధులలో సుమారు పెద్దఎత్తున చెత్త పేరుకు పోయింది.
కేసులతో వాత..
ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బాణసంచా పేల్చేందుకు విధించిన సమయాన్ని అనేక చోట్ల ప్రజలు ఖాతరు చేయలేదు. రాత్రి 10 గంటల వరకు సైతం గాల్లో రంగు రంగుల బాణసంచా మారుమోగాయి. చైన్నె నగరంతో పాటూ ఆవడి, తాంబరంలలో గస్తీ పోలీసులు ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా పేల్చుతున్న వారిని పసిగట్టి కేసులతో వాతలు పెట్టారు. చైన్నెలో 319 మందిపై కేసులు పెట్టారు. అయితే రాష్ట్రంలో గతంలో కంటే ఈసారి అతిపెద్ద ప్రమాదాలు తక్కువే. అయితే చిన్నచిన్న ప్రమాదాలు ఎక్కువ. టపాకాయల కారణంగా గాయపడ్డ వారిని ఆస్పత్రులలో చేర్పించడంలో 108 సిబ్బంది విస్తృతంగా సేవలు అందించారు. చైన్నెలో 200 మంది వరకు గాయపడ్డారు. ఇక మంగళవారం సైతం పండగను అనేక మంది జరుపుకున్నారు. నోములు నోచి పూజలలో లీనమయ్యారు. ఇక పండుగ రోజైన సోమవారం మందుబాబులు పూటుగా మద్యాన్నితాగేశారు. రూ. 789 కోట్లకు మద్యం విక్రయాలు జరగడం గమనార్హం.
ప్రత్యేక బస్సులు..
దీపావళి సంబరాలు ముగియడంతో స్వస్థలాలకు వెళ్లిన జనం మంగళవారం సాయంత్రం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. వీరికోసం ఆయా మార్గాలు, వివిధ ప్రాంతాల నుంచి చైన్నె వైపుగా సాధారణ బస్సులతో పాటూ అదనంగా ప్రత్యేక బస్సులను రవాణా సంస్థ రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంది. చైన్నె వైపు 5,140 బస్సులను నడిపారు. టోల్ గేట్ల వద్ద కిలో మీటర్ల కొద్ది దూరం వాహనాలు బారులుదీరాయి. బుధవారం నగరంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్భందీగా చర్యలు తీసుకున్నారు. కిలాంబాక్కం నుంచి ప్రయాణికులు నగరంలోకి వచ్చేందుకు వీలుగా దక్షిణ రైల్వే అదనపు ఎలక్ట్రిక్ రైలు సేవలకు నిర్ణయించింది.

ఆనందోత్సాహాలతో.. దీపావళి

ఆనందోత్సాహాలతో.. దీపావళి

ఆనందోత్సాహాలతో.. దీపావళి