
క్లుప్తంగా
అదుపుతప్పిన
పోలీస్ వాహనం
– డీఎస్పీ సహా ఇద్దరికి గాయాలు
తిరువళ్లూరు: పూందమల్లి నుంచి తిరువళ్లూరు వెళుతున్న డీఎస్పీ వాహనం అదుపుతప్పిన సంఘటనలో డీఎస్పీ, కానిస్టేబుల్ గాయపడ్డారు. తిరువళ్లూరు జిల్లా ఎస్పి కార్యాలయంలో అమరవీరులకు నివాళులర్పించే అర్పించే కార్యక్రమం ఉదయం 6గంటలకు జరిగింది. కార్యక్రమానికి హాజరుకావడానికి పూందమల్లి నుంచి తిరువళ్లూరు డీఎస్పీ కుమరన్ ప్రభుత్వం వాహనంలో బయలుదేరారు. వాహనాన్ని రిజర్వ్ కానిస్టేబుల్ అరుల్‌రాజ్(25) నడిపారు. తిరువళ్లూరు సమీపంలోని మురుగంజేరి వద్ద కుక్క ను తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డీఎస్పీ కుమరన్(35), కానిస్టేబుల్ అరుల్‌రాజ్ ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న మనవాలనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ ఇద్దరిని చైన్నెలోని వైద్యశాలకు తరలించారు.
20 రోజుల్లో
9 కోట్ల మంది ప్రయాణం
కొరుక్కుపేట: దీపావళి సీజన్‌లో ప్రయాణికుల ప్రయాణాలు సజావుగా ఉండేలా సదరన్ రైల్వే పటిష్ట చర్యలు తీసుకుందని సదరన్ రైల్వే చైన్నె డివిజినల్ రైల్వే మేనేజర్ శైలేంద్రసింగ్ తెలిపారు. గత 20 రోజుల్లో సదరన్ రైల్వేలో 9 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సమావేశంలో మాట్లాడారు. దీపావళి పండుగ సీజన్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించడానికి సదరన్ రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుందని అన్నారు. అదనపు రద్దీని తట్టుకునేందుకు సదరన్ రైల్వే ఇప్పటి వరకు 85 ప్రత్యేక రైలు సేవలను ప్రకటించిందని తెలిపారు .
బైక్‌ను ఢీకొన్న కారు
–తాత, మనవరాలు మృతి
అన్నానగర్: బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో తాతమనవరాలు దుర్మరణం చెందారు. నైల్లె జిల్లాలోని పనగుడి సమీపంలోని వడకంకుళంకు చెందిన జోసఫ్ (65). ఇతను సెలూన్ దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమారుడు బాలసురేష్, కుమార్తె వర్ష (14). ఈమె ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ స్థితిలో సోమవారం మధ్యాహ్నం, జోసఫ్ మనవరాలిని బైక్‌లో ఎక్కంచుకుని వడక్కంకుళంలోని తన తోటకి వెళుతున్నాడు. నైల్లె–కుమరి నాలుగు లేన్ల రహదారిపై వెళుతుండగా కారు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తాతమనవరాలు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పళవూరు సీఐ సురేష్‌కుమార్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆసరిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో కారు డ్రైవర్ పలయంకోట్టై ఎన్జీఓ కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలుడని, అతను దీపావళికి ప్లస్‌వన్ చదువుతున్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో కన్యాకుమారికి వెళ్లాడని తెలిసింది. బాలుడి తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి తండ్రి విదేశాల్లో ఉన్నందున పోలీసులు అతనిపై కేసు నమోదు చేయలేదు.
అనాథాశ్రమంలో
దీపావళి చాలా ఆనందం
వేలూరు: దీపావళి పండుగను అనాథాశ్రమంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో వేలూరు సమీపంలోని పొయిగై గ్రామంలో అనాథాశ్రమం ఉంది. కలెక్టర్ ఆశ్రమంలోని వారికి నూతన దుస్తులు అందజేసి స్వీట్లు పంచి దీపావళి పండుగను జరుపుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తన కుటుంబంతో కలిసి జిల్లా యంత్రాంగం పూర్తిగా ఆశ్రమంలో వేడుకలు జరుపుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇటువంటి అనాథాశ్రమంలో పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు కూడా జరుపుకోవాలన్నారు. ప్రస్తుతం రెడ్‌క్రాస్ సంఘం ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వారికి అవసరమైన సౌకర్యాలను అందజేస్తున్నారని మరిన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్య క్రమంలో సబ్ కలెక్టర్ సెంథిల్‌కుమార్, రెడ్ క్రాస్ సంఘం చైర్మన్ ఉదయశంకర్, కార్యదర్శి పర్వద, కోశాధికారి పాండియన్, ఇంద్రకుమార్, అధికారులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

క్లుప్తంగా