
నవంబర్ 5 నుంచి ఐఐటీ మద్రాసులో గ్లోబల్ సదస్సు
కొరుక్కుపేట: ఐఐటీ మద్రాసు గ్లోబల్, గేట్స్ ఆధ్వర్యంలో గేట్స్ ఇండియా ఐసీటీ చానల్ సమిట్ 2025ను నవంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ మద్రాసు గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల మాదవ నారాయణ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సమ్మిట్‌కు 250 మందికి పైగా ఐసీటీ( ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ) ఛానల్ లీడర్లతో పాటూ టెక్నాలజీ ఇన్నోవేటర్లు, విధాన నిర్ణేతలు తదితరులు పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 6వ తేదీన ఇండియా ఇంక్ ఎట్ ఫుల్ థ్రోటిల్ –ఫ్రమ్ ఇన్నోవేషన్ టూ గ్లోబల్ ఇంపాక్ట్ అనే అంశంపై ప్రత్యేక సెషన్ జరుగుతుందని వెల్లడించారు.
హైదరాబాద్ వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య
కొరుక్కుపేట: చైన్నె నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ ప్యాసింజర్ విమానంలో హటాత్తుగా సాంకేతిక సమస్య ఏర్పడటంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో 79 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. చైన్నెలోని మీనంబాక్కం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ ప్యాసింజర్ విమానం మంగళవారం ఉదయం 6 గంటల కు చైన్నె దేశీయ విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమానంలో 74 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 79 మంది ఉన్నారు. విమానం రన్ వే పై ప్రారంభకాగానే ఫైలెట్ ఇంజిన్‌లో వైఫల్యాన్ని గుర్తించి వెంటనే విమానాశ్రయ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి రన్ వే పై ఆపారు. అనంతరం ఇంజినీర్లు మరమ్మతులు చేపట్టడం ఆలస్యం కావటంతో ప్రయాణికులను మరో విమానంలో హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా విమానంలో సాంకేతిక లోపాన్ని సకాలంలో గుర్తించటంతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది.
విజయ్ పార్టీని దేవుడూ కాపాడలేడు!
కొరుక్కుపేట: అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే విజయ్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయ్‌కుమార్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. మదురైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం స్టాలిన్ ప్రభుత్వం చెప్పడం ఒకటి , చేయటం మరొకటి అని ఎప్పటి నుంచో అన్నాడీఎంకే ప్రదాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి నిరంతరం చెబుతూనే ఉన్నాడన్నారు. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు సమయంలో రోడ్లన్నీ గుంతలతో నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అవి సరిచేయడంపై దృష్టిపెట్టాలని కోరారు. డీఎంకేను ఓడించే శక్తులన్నీ ఎడప్పాడి వెనుక నడవాలని, నటుడు విజయ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఫలితం భిన్నంగా ఉంటుందన్నారు.
విజయ్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి
తమిళసినిమా: తన అభిప్రాయాలను నిర్భంగా వ్యక్తం చేసే నటి కస్తూరి. అలా ఆమె పలు వివాదాల్లో చిక్కుకున్నారు కూడా. తాజాగా నటుడు , తమిళగ వెట్రికళం పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు ఓ సలహా ఇచ్చారు. తిరువణ్ణామలైలోని అన్నామలై స్వామిని దర్శించుకున్న నటి కస్తూరి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరూర్ ఘటన తరువాత విజయ్ తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో కూటమి అన్నది కరెక్ట్ కాదన్నారు. ఆయన ఎన్‌డీఏ కూటమిలో చేరి కార్యక్రమాలను నిర్వహించడమే ఆయనకు మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుతం తన పార్టీలో ఉన్న వారి నుంచి ఆయన బయటకు రావడమే శ్రేమస్కరం అన్నారు. ఈ పరిస్థితుల్లో విజయ్ సొంతంగా నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. ఇకపోతే ఎన్‌డీఏ కూటమి నుంచి టీటీవీ దినకరన్ బయటకు రావడానికి కారణం ఆయనకు అన్నాడీఎంకేతో ఏర్పడిన అభిప్రాయ భేదాలేనని, బీజేపీతో ఆయనకు ఎలాంటి సమస్య లేదని నటి కస్తూరి పేర్కొన్నారు.
తంజావూరు ఆలయంలో పందకాల్ మహోత్సవం
కొరుక్కుపేట: తంజావూరు ఆలయాన్ని నిర్మించిన రాజ రాజ చోళుని 1040వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలను ఈనెల 30, నవంబర్ 1 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం ఉదయం తంజావూరు ఆలయంలో పందకాల్ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాగంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలను చేపట్టారు. ట్రస్టీ బాబాజీ , ఇతర పాలకమండలి సభ్యులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.