
అమర వీరుల త్యాగాలకు వెలకట్టలేం!
సాక్షి, చైన్నె: పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం డీజీపీ కార్యాలయ ఆవరణలో పోలీసు స్మారక చిహ్నం వద్ద సీఎం స్టాలిన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. పోలీసు కుటుంబ వారసులకు కారుణ్య ప్రాతిపదికన 175 మందికి ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 20 మందికి వారసులకు సీఎం స్టాలిన్ స్వయంగా ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. అలాగే విధి నిర్వహణలో మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు బీమా మొత్తం, ఎక్స్‌గ్రేషియా మొత్తం రూ. 5.70 కోట్లు అందజేశారు. వివరాలు.. ప్రతి సంవత్సరం అక్టోబరు 21వ తేదీన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా అనుసరిస్తున్న విషయం తెలిసిందే. ఇందలో భాగంగా ఉదయాన్నే చైన్నె మెరీనా తీరంలోని పోలీసు డీజీపీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని పోలీసు స్మారక చిహ్నం వద్ద కు సీఎం స్టాలిన్ చేరుకున్నారు. ఆ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. ఈ సంస్మరణ దినోత్సవ వేడుకలో సీఎం పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
కారుణ్య నియామకాలు..
అనంతరం తమిళనాడు పోలీసుశాఖలో పనిచేస్తున్నప్పుడు మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు చెందిన 110 మందిని ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు, మరో 65 మందిని డేటా ఎంట్రీ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్ పోస్టులకు కారుణ్య నియామకం ప్రాతిపదికన ఉద్యోగాలను కేటాయించారు. విధి నిర్వహణలో మరణించిన తిరుప్పూర్ జిల్లా స్పెషల్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఎం. షణ్ముగవేల్, కృష్ణగిరి జిల్లా హెడ్ కానిస్టేబుల్ ఎస్. జాస్మిన్ మిల్టన్ రాజ్ కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వ జీతం ప్యాకేజీ పథకం కింద వ్యక్తిగత బీమా మొత్తంగా ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున చెక్కులను అందించారు. అలాగే విధి నిర్వహణలో మరణించిన విరుదునగర్ జిల్లా స్పెషల్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ పి. విజయకుమార్, కృ ష్ణగిరి జిల్లా హెడ్ కానిస్టేబుల్ ఎస్. జాస్మిన్ మిల్టన్ రాజ్ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్‌గ్రేషియాగా రూ. 20 లక్షల చెక్కులను అందజేశారు. ప్రమాదాలలో మరణించిన వారికి తమిళనాడు ముఖ్యమంత్రి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తమిళనాడు ప్రభుత్వ జీత ప్యాకేజీ పథకం కింద, వ్యక్తిగత ప్రమాద బీమా, తమిళనాడు ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ముగ్గురు పోలీసుల సహా ఆరుగురి కుటుంబాలకు మొత్తం రూ. 5.70 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మురుగానందం, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్, ఇన్‌చార్జ్ డీజీపీ జి. వెంకటరామన్, చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఎ. అరుణ్, ఐఏఎస్, సీనియర్ పోలీసు అధికారులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ వివేకానంద్ చౌబే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సత్యపాన్ బెహ్రా పాల్గొన్నారు.

అమర వీరుల త్యాగాలకు వెలకట్టలేం!