
వర్షపు నీటి ఆదాపై అవగాహన
తిరువళ్లూరు: వర్షపు నీటిని ఆదా చేసే విషయంపై ప్రజల్లో మరింత అవగాహన అవసరమని కలెక్టర్ ప్రతాప్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షపు నీటి ఆదా, స్వచ్ఛమైన నీటిని తాగడం వంటి అంశాలపై అవగాహన ర్యాలీని మంగళవారం ఉదయం కలెక్టరేట్ నుంచి నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీలో విద్యార్థులు స్వచ్ఛమైన తాగునీటిని తాగాలని, వర్షపు నీటిని ఆదా చేయాలని నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటి ఆదాపై అవగాహన అవసరమన్నారు. జిల్లాలోని నీటి ఆధారిత ప్రాంతాలు, కొలను, చెరువులు, నదులను పరిరక్షించుకోవాలని సూచించారు. జిల్లాలో తాగునీటిని పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు వారంలో నాలుగు రోజులు గ్రామాలకు వెళ్లి తాగునీటిలో కలుషితంపై పరిశోధనలు నిర్వహిస్తాయని తెలిపారు. అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.