
విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలను మరింత పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే, ఉన్నత విద్యను విద్యార్థులందరికీ అందించే విధంగా అధ్యయనానికి నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖా మంత్రి కోవిచెలియన్ నేతృత్వంలో చైన్నెలో సమావేశం జరిగింది. ఇందులో అన్నా వర్సిటీ, భారతియార్, భారతిదాసన్, మదురై కామరాజ్, మనోన్మనీయమ్, అలగప్ప, అన్నామలై, పెరియార్, మదర్‌థెరిసా, తిరువల్లువర్, ఓపెన్ సహా 13 విశ్వవిద్యాలయాలకు చెందిన రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు, పరీక్షల విభాగం అధికారులు పాల్గొన్నారు. విద్యా కోర్సులు, కార్యకలాపాలు, ఉన్నత విద్య మరింత మెరుగ్గా అందుబాటులోకి తెచ్చే రీతిలో చర్చించారు. పాఠ్యాంశాలు, ప్రశ్నపత్రాల రూపకల్పన గురించి సమీక్షించారు. జాతీయ స్థాయి సాంకేతిక పోటీల్లో తమిళనాడు నుంచి విద్యార్థుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఉన్నత విద్యా సంస్థల్లో అందించే కోర్సుల క్రెడిట్లు, విశ్వవిద్యాలయాల నిర్మాణం, పరిశోధన వాతావరణం గురించి అధ్యయనం చేశారు. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్, మిషిన్ లెర్నింగ్ కోర్సులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా కొత్త కోర్సులు రూపకల్పన, ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడం వంటి అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి డా.పి.శంకర్, తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.పి. విజయకుమార్, డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.సుందరవల్లి, డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ జె. ఇన్నోసెంట్ దివ్య, తమిళనాడు ఉన్నత విద్యా మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ డి.వెల్‌మురుగన్ పాల్గొన్నారు.