
నాటుబాంబులు స్వాధీనం
తిరువళ్లూరు: నాటుబాంబులతో ప్రత్యర్థులను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు నాటుబాంబులు. నాలుగు కిలోల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు చెందిన ఇద్దరు యువకులు గత కొద్ది రోజులుగా తిరువళ్లూరులోని వీఎం నగర్‌లోని ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ ఆసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ వివేకనంద శుక్లాకు స్థానికులు కొందరు సమాచారం ఇచ్చారు. దీంతో సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని ఎస్పీ తిరువళ్లూరు టౌన్ పోలీసులను ఆదేశించారు. ఇందులోభాగంగానే అక్కడ పోలీసులు తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఇంట్లో వున్న ఇద్దరు యువకులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకులు కడంబత్తూరుకు చెందిన వారుగా గుర్తించారు. వీరు పాతకక్షల నేపత్యంలో ఒకరిని హత్య చేయడానికి నాటుబాంబులను కొనుగోలు చేసి నిల్వ వుంచినట్టు నిర్ధారించారు. వారి నుంచి నాలుగు నాటుబాంబులతోపాటు నాలుగు కిలోల గంజాయి సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.