
ముగిసిన సీఎం కప్ పోటీలు
సాక్షి, చైన్నె : సీఎం కప్ క్రీడా పోటీలు 2025 మంగళవారంతో ముగిసింది. మొదటి మూడు స్థానాలను చైన్నె, చెంగల్పట్టు, కోయంబత్తూరు జిల్లాలకు చెందిన అథ్లెట్లు, క్రీడాకారులు నిలిచారు. వీరికి సీఎం స్టాలిన్ సాయంత్రం నెహ్రు స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ట్రోఫీలు అందజేశారు. వివరాలు.. 2025 సీఎం ట్రోఫీ పోటీలు తొలుత జిల్లా తదుపరి జోనల్ స్థాయిలో సెప్టెంబర్‌లో జరిగాయి. ఈ పోటీలు చైన్నె, మధురై, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి, నాగపట్టణం, దిండిగల్, తంజావూరు, తూత్తుకుడి, తిరునెల్వేలి, వెల్లూరు, తిరువణ్ణామలై, సేలం మరియు చెంగల్పట్టు 13 నగరాల్లో జరిగాయి. అక్టోబరు 2వ తేది నుంచి మంగళవారం (14వ తేదీ)వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. రాష్ట్ర స్థాయి పోటీలలో వివిధ పోటీలలో తొలి విజేతకు రూ. లక్ష, రెండో విజేతకు రూ. 75 వేలు, మూడో విజేతకు రూ. 50 వేలు బహుమతి అందజేశారు. ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీలలో మొదటి మూడు స్థానాలు గెలుచుకున్న జిల్లాల నుండి అథ్లెట్లు ఆటగాళ్లకు ట్రోఫీలు ప్రదానం జరిగింది. ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీలు – 2025లో పాఠశాల, కళాశాల, వికలాంగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు అంటూ 5 విభాగాలలో అథ్లెటిక్స్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్‌తో సహా 37 క్రీడా విభాగాల్లో మొత్తం 196 పోటీలు విజయవంతంగా నిర్వహించారు. చైన్నె జిల్లా మొత్తం 281 పతకాలతో మొదటి స్థానం దక్కించుకుంది. అథ్లెట్లకు వైద్య బీమా పథకం ఈసందర్భంగా ప్రకటించి, అర్హులైన వారికి కార్డులను అందజేశారు. అలాగే ప్రతిభావంతులైన అథ్లెట్లకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం అందించేందకు సిద్ధంగా ఉన్నామన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రి పి.కె. శేఖర్ బాబు, కార్పొరేషన్ మేయర్ ఆర్ ప్రియ, పార్లమెంటు సభ్యులు దయానిధి మారన్, డా. కళానిధి వీరాసామి, తమిళచ్చి తంగపాండియన్ , క్రీడల శాఖకార్యదర్శి డాక్టర్ అతుల్య మిశ్రా, చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డి, చైన్నె జిల్లా కలెక్టర్, రష్మి సిద్ధార్థ్ జగదే, చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ స్నేహ, కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన సీఎం కప్ పోటీలు