
బోయకొండ కిటకిట
చౌడేపల్లె : బోయకొండ జనంతో ఆదివారం కిక్కిరిసిపోయింది. కర్ణాటక భక్తులు, స్థానిక భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. వేకువ జామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొండపై ఎటుచూసినా భక్తుల సందోహం కనిపించింది. ఆలయంలో క్యూలైన్లు నిండిపోయాయి. గంటల తరబడి నిరీక్షించి భక్తులు దర్శనం చేసుకున్నారు. సుమారు 25 వేలమందికిపైగా అమ్మవారిని భక్తులు దర్శించుకొన్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. ఊహించని రీతిలో వాహనాల్లో భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నాలుగు కాళ్ల మండపం నుంచి రణభేరి గంగమ్మ ఆలయం వద్దకు వాహనాల రాకపోకలు స్తంభించడం, పోలీసులు పత్తాలేకపోవడంతో భక్తులు, వాహనదారులు అవస్థలు పడ్డారు.