
ఆంధ్రాలో స్టాక్.. తమిళనాడులో కిక్కు
బత్తలవల్లం కేంద్రంగా మత్తు పదార్థాల విక్రయాలు ఆంధ్రా నుంచి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా బత్తలవల్లంలో భారీ గోడౌన్ గుట్కా, హాన్స్, ఇతర మత్తు పదార్థాల నిల్వలు
మత్తు పదార్థాలను తమిళనాడు
ప్రభుత్వం విక్రయించకుండా బ్యాన్
విధించింది. ఆ వ్యాపారంలో రాటుదేలిన అక్రమ వ్యాపారులు ఏకంగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలో మకాం పెట్టారు. దీంతో బత్తలవల్లం కేంద్రంగా మత్తు పదార్థాల
విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏకంగా బత్తలవల్లంలోని ఓ ఆలయ సమీపంలో గోడౌన్‌లో పెద్దఎత్తున గుట్కా, హాన్స్,
ఇతర మత్తు పదార్థాలను భారీగా నిల్వలు చేసి అటు తమిళనాడు, ఇటు ఆంధ్రాలో
విక్రయించి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేపడుతున్నారు.
వరదయ్యపాళెం : ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన సత్యవేడు నియోజకవర్గం అక్రమ వ్యాపారాలకు కేంద్రంగా మారుతోంది. ఆ దిశగా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం కేంద్రంగా మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రాలో లైసెన్సులు పొంది తమిళనాడులో అక్రమ మత్తు పదార్థాల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో లక్షల్లో వ్యాపారం చేతులు మారుతున్నాయి.
ఆక్రమంగా తరలిస్తూ..
తమిళనాడులో హాన్స్, గుట్కా, ఇతర మత్తు పదార్థాలకు బ్యాన్ విధించడంతో బహిరంగ దుకాణాల్లో విక్రయించేందుకు వీలు లేదు. దీంతో ఆంధ్రాలో నిల్వలు ఉంచుకుని తమిళనాడుకు తరలిస్తూ ఈ అక్రమ మత్తు పదార్థాల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు సమీపంలోని తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు గ్రామాలు ఆరంబాకం, గుమ్మిడిపూండి, మాదరపాకం, కవరపేట ప్రాంతాల్లో విక్రయించేందుకు ఆంధ్రా నుంచి పెద్దఎత్తున తరలిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఆ ప్రాంతాల్లో మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు అధిక ధరలకు సైతం వీటిని కొనుగోలు చేస్తూ వ్యసనానికి బానిసలవుతున్నారు. నెలసరి మామూళ్లతో అధికారులను తమవైపు తిప్పుకుని వారి సహకారంతోనే ఈ అక్రమ వ్యాపారం కొనసాగిస్తుండడం గమనార్హం.
ఇళ్ల మధ్యలో గోడౌన్
మత్తు పదార్థాల అక్రమ వ్యాపారానికి సంబంధించి గోడౌన్‌ను బత్తలవల్లంలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ వ్యాపారాలను ఇళ్ల మధ్య నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు
ప్రధానంగా మత్తు పదార్థాలు నిల్వల గురించి ఫుడ్ సేఫ్టీ అధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్పందించాల్సి ఉంది. ఆంధ్రాలో మత్తు పదార్థాల విక్రయానికి బ్యాన్ లేని కారణంగా గోడౌన్‌కు లైసెన్సు ఉందా? వ్యాపార సామర్థ్యాన్ని బట్టి ట్యాక్స్ చెల్లిస్తున్నారా? లేదా? అని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు విచారణ చేయాల్సి ఉంది. ఒక వేళ లైసెన్స్ ఉంటే పంచాయతీ అధికారులు, స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు లైసెన్సు రద్దు చేసేందుకు పంచాయతీ అధికారులకు అధికారం ఉంది. అయితే దర్జాగా మత్తు పదార్థాల నిల్వలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం అటువైపు చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.