
క్లుప్తంగా
8న కుంభాభిషేకం
తిరువొత్తియూరు: కాంచీపురం ఏకాంబరనాథర్ ఆలయంలో 17 సంవత్సరాల తర్వాత కుంభాభిషేకం జరగనుంది. ఈ ఆలయంలో రూ.28 కోట్ల విలువైన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. కుంభాభిషేకం డిసెంబర్ 8న జరగనుందని కాంచీపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పి.కె. శేఖర్‌బాబు అన్నారు.
విద్యార్థికి కమల్
ఆర్థిక సాయం
కొరుక్కుపేట: మక్కల్ నీది మయ్యమ్ పార్టీ క్రీడల అభివద్ధి బృందం రాష్ట్ర కార్యదర్శి అరవింద్‌రాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో యోషిత (7వ తరగతి), గంగైకొండన్ (2వ తరగతి), యోగివర్మన్ (2వ తరగతి) బాక్సింగ్ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. బాక్సింగ్ ట్రైనర్ లింగేశ్వరన్ తన కుటుంబంతో కలిసి చైన్నెలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, ఎంపీ కమలహాసన్‌ను కలిశారు. జూలై 18న వియత్నాంలో జరిగిన ఆసియా స్థాయి పవర్ లిఫ్టింగ్ ఆసియా చాంపియన్‌షిప్ 2025లో 9 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో 4 బంగారు పతకాలు గెలుచుకున్నారు. రష్యాలోని మాస్కోలో జరిగే ప్రపంచ స్థాయి పోటీలో ఎం.కార్తిక్ పాల్గొంటారు. కమలహాసన్‌ను కలిసి ఆయన శుభాకాంక్షలు అందుకున్నారు. చైన్నెలో కమల హాసన్ విద్యార్థి యోషిత రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలో పాల్గొనడానికి ఆర్థిక సాయం అందించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎ.అరుణాచలంక్రీడాభివృద్ధి బృందం రాష్ట్ర కార్యదర్శి అరవిందరాజ్ పాల్గొన్నారు.
బ్యాంకుకు 53 కిలోల
బంగారు ఆభరణాలు
కొరుక్కుపేట: ఆలయ భక్తుల నుంచి కానుకలుగా అంది వినియోగించని బంగారు ఆభరణాలను కరిగించి బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టే ప్రాజెక్టును హిందూ మత ధర్మాదాయ దేవదాయ శాఖ అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా, కాంచీపురం కామాక్షి అమ్మన్ ఆలయం, కుండ్రత్తూరు సుబ్రమణ్యం, తిరుమలవై యావూరులోని వామికోవిల్, తిరువిడంతై నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయం, ప్రసన్న వెంకటేశ పెరుమాళ్ ఆలయానికి చెందిన 53 కిలోల 386 గ్రాముల నిరుపయోగంగా ఉన్న బంగారు ఆభరణాలను ముంబైలోని కేంద్ర ప్రభుత్వ గోల్డ్ స్మెల్టర్‌లో కరిగించి బ్యాంకులో జమ చేశారు. కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ ఆలయంలోని నవరాత్రి హాలులో పెట్టుబడి కార్యక్రమం జరిగింది. మంత్రి పి.కె. శేఖర్‌బాబు సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గాంధీ, ఎమ్మెల్యేలు సుందర్, ఎళిలరసన్, కలెక్టర్ కలై సెల్వి మోహన్ పాల్గొన్నారు
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,571 మంది స్వామివారిని దర్శించుకోగా 36, 711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివా రికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
శాస్త్రోక్తంగా
పవిత్రోత్సవాలు
చంద్రగిరి: స్థానిక శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసో తెలియకో జరిగే దోషాల నివృత్తికి ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. మొదటిరోజు ఆదివారం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్ర నామార్చన, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పవిత్ర హోమాలను నిర్వహించారు.
వైభవంగా
శివమహోత్సవం
నగరి: శ్రీకామాక్షీ సమేత కరకంఠేశ్వర ఆలయంలో ఆదివారం ప్రపంచ శివసేవకుల అసోసియేషన్ గుర్తింపు కార్డుల జారీ నిమిత్తం శివమహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తమిళనాడు శైవ సేవకుల కోఆర్డినేటర్ ఈశ్వరన్ స్వామి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్ర శైవసేవక అసోసియేషన్ కార్యదర్శి జంబులింగం స్వామి భక్తులకు పంచపురాణం, తిరువాసగంపై ఉపదేశం చేశారు. అనంతరం అసోసియేషన్ గుర్తింపుకార్డులను సేవకులకు అందించారు. భక్తులందరికీ ఆలయం వద్ద సహపంక్తి భోజనం పెట్టారు. నగరి, పుత్తూరు మాణిక్యవాసగర్ శివసేవకుల అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.