
జన జాతర!
కిక్కిరిసిన వాణిజ్య కేంద్రాలు జోరుగా కొనుగోళ్లు ఆమ్నీ బస్సు చార్జీలకు రెక్కలు చర్యలు చేపడుతామన్న మంత్రి శివశంకర్
దీపావళి పండుగ సమీపిస్తుండడంతో ఆదివారం రాష్ట్రంలోని వాణిజ్య కేంద్రాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. పండుగకు వారం రోజులే సమయం ఉండడంతో ఏ వాణిజ్యకేంద్రం చూసినా జన సందోహంతో నిండిపోయింది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసు యంత్రాంగం నిఘాతో వ్యవహరించింది. బాణసంచా ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఆంక్షలను విధించారు.
సాక్షి, చైన్నె: వెలుగులు పండుగ దీపావళి అంటే అందరికీ ఆనందమే. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగకు వారం రోజులే సమయం ఉంది. శుక్రవారం నుంచి జనం పండుగ కోసం స్వస్థలాలకు తరలి వెళ్లనున్నారు. దీంతో పండుగ కోసం కొత్త బట్టల కొనుగోళ్లు ఓ వైపు, ఆకర్షణీయమైన బంగారు ఆభరణాలు కొనుగోళ్లు మరోవైపు జోరందుకున్నాయి. వివిధ షోరూంలు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తుండడంతో వాటిని కొనుగోలు చేయడానికి జనం పెద్ద ఎత్తున మాల్స్, వాణిజ్య కేంద్రాల వైపుగా ఆదివారం కదిలారు. పండుగకు ముందుగా, స్వస్థలాలకు బయలుదేరి వెళ్లే వారికి చివరి సెలవు ఆదివారం కావడంతో రాష్ట్రంలోని ఏ వాణిజ్య కేంద్రం చూసినా జనంతో కిటకిటలాడాయి. కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, తూత్తుకుడి, తంజావూరు, సేలం, కడలూరు,నాగపట్నం, తెన్‌కాశి, దిండుగల్, విల్లుపురం, తిరుప్పూర్, ఈరోడ్ తదితర నగరాలలోని షాపింగ్ సెంటర్లు,రోడ్ సైడ్ దుకాణాల వద్దకు జనం పెద్దఎత్తున తరలి వచ్చి కొత్త బట్టల కొనుగోళ్లలో నిమగ్నం అయ్యారు. జనం కిక్కిరిసి ఉండడంతో దొంగలు తమ పనితనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తారన్న భావనతో పోలీసులు ముందు జాగ్రత్తగా నిఘాతో వ్యవహరించే పనిలో పడ్డారు. షాపింగ్‌సెంటర్లలో పోలీసులు కట్టుదిట్టంగా భద్రత కల్పించారు.
టీ నగర్‌లో జనహోరు..
చైన్నెలో నగరంలో అతిపెద్ద వర్తక కేంద్రంగా టీ నగర్, పాండి బజార్, రంగనాథం వీధి పరిసరాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇసుక వేస్తే రాలనంతంగా జనంతో షాపింగ్ సెంటర్లు కిట కిటలాడాయి. జనం పోటెత్తడంతో అన్ని మాల్స్, వస్త్ర దుకాణాలలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు హెచ్చరించడమే కాకుండా మఫ్టీలో విధుల్ని నిర్వర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలను వీక్షిస్తూ దొంగల భారీన జనం పడకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే ఆ పరిసర మార్గాల్లో ట్రాఫిక్ పద్మ వ్యూహంలో వాహనాలు చిక్కకుండా పకడ్బందీ చర్యలతో ముందుకు సాగారు. ఇక, చైన్నె నగరంలోని పురసైవాక్కం, వన్నార్ పేట, తాంబరం, క్రోం పేట, పల్లావరం, వేళచ్చేరి పరిసరాల్లోని వాణిజ్యకేంద్రాలకు జనం తరలిరావడంతో పండుగ కొనుగోళ్లు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల పొద్దు పొయే వరకు వ్యాపారం జరిగింది. బట్టలే కాదు, వాహనాల కొనుగోళ్ల మీద సైతం దృష్టి పెట్టిన వారు అధికంగానే ఉన్నారు.జనం శివారు నుంచి చైన్నె వైపుగా తరలి రావడంతో ఎలక్ట్రిక్ రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు సైతం జనంతో కిటకిటలాడాయి. ఆయా మార్గాలలో ట్రాఫిక్ రద్దీ పెరగకుండా ఆదివారం సైతం పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది దీపావళితో పాటూ బిహార్ ఎన్నికలలో ఓట్లు వేసేందుకు రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులు స్వస్థలాలకు బయలు దేరడానికి సిద్ధమయ్యారు. బిహార్ కార్మికులు అత్యధికంగా బయలు దేరనున్న నేపథ్యంలో వివిధ పనుల వేగం మందగించే అవకాశాలు ఉన్నాయి.
బాణసంచాలకు ఆంక్షలు..
పండుగ సందర్భంగా అన్ని రకాల అనుమతులతో ఎక్కడికక్కడ బాణసంచా దుకాణాల ఏర్పాటు మీద విక్రయదారులు దృష్టి పెట్టడం జరుగుతోంది. ఈసారి అన్ని దుకాణాలకు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దుకాణాల్లో భద్రతా పరంగా తీసుకున్న చర్యలపై పరిశీలనకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. బాణసంచా నిల్వ ఉంచిన గోడౌన్ల వద్ద కల్పించిన భద్రతను ఈబృందాలు తనిఖీలు చేయనున్నాయి. చైన్నెలో పలు ప్రాంతాలలో దుకాణాలకు ఇంత వరకు అనుమతి ఇవ్వలేదంటూ ఇప్పటికే వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐల్యాండ్ గ్రౌండ్‌లో పెద్దఎత్తున దుకాణాల ఏర్పాటు ప్రతి ఏటా జరుగుతుంది. ఈ ఏడాది ఇంత వరకు ఇక్కడ పనులు మొదలుకాలేదు. అదే సమయంలో పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వర్గాలు బాణసంచా కాల్చేందుకు పలు ఆంక్షలు విధించింది. ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, గుడిసె ప్రాంతాలు, శాంతియుతంగా ఉండే ప్రాంతాలలో బాణసంచా కాల్చవద్దని సూచించారు. భారీ శబ్దంతో కూడిన బాణసంచా, పర్యావరణానికి హాని కలిగించే బాణ సంచాను ప్రజలు దూరం పెట్టాలని కోరారు. ఇక స్వీట్ల వ్యాపారం ఊపందుకుంది. దీపావళి అంటే వెలుగులతో పాటుగా తీపి పదార్థాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. దీంతో మార్కెట్‌లోని వివిధ స్వీట్ దుకాణాలన్నీ సరికొత్త టేస్టుతో వివిధ రకాలను కొలువు దీర్చాయి.
ఆమ్నీ టికెట్ ధరకు రెక్కలు
జనం స్వస్థలాలకు శుక్రవారం నుంచి బయలు దేరనున్నారు. ఇప్పటికే రైళ్లు ఫుల్ అయ్యాయి. ప్రత్యేక రైళ్లపై దక్షిణ రైల్వే దృష్టి పెట్టింది. ఈ పరిస్థితులలో హఠాత్తుగా ఆమ్నీ బస్సుచార్జీలకు రెక్కలు వచ్చాయి. ఆయా యాప్‌ల ద్వారా బస్సుల రిజర్వేషన్ మీద దృష్టి పెట్టిన వారికి ఆదివారం పెద్ద షాక్ తప్పలేదు. చైన్నె నుంచి తిరునల్వేలికి ఇది వరకు రూ.1400 నుంచి రూ.1,800గా ఉన్న చార్జీలు తాజాగా రూ. 2,000 నుంచి రూ. 4,500, కోయంబత్తూరుకు రూ. 800–రూ.1,200 గా ఉన్న చార్జీలు రూ. 1,800 –రూ.3,000, మదురైకు రూ. 700–రూ.1,100 నుంచి రూ. 2,000 – రూ. 4,100, నాగర్‌కోయిల్‌కు రూ. 900– రూ. 1,500 నుంచి రూ. 2,000–4,400, తిరుచ్చి రూ. 600–రూ.900 నుంచి రూ.1,800– రూ. 3,600లుగా చార్జీలు పెంచేశారు. ప్రయాణికుల నడ్డి విరిచే విధంగా ఈ చార్జీల మోత మోగడాన్ని రవాణాశాఖ మంత్రి శివశంకర్ తీవ్రంగా పరిగణించారు. పండుగలోపు చార్జీలను తగ్గించని పక్షంలో ఆయా సంస్థల బస్సులను సీజ్ చేస్తామని, జరిమానా విధించి కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం నుంచి అన్ని మార్గాలో ఆమ్నీ బస్సులపై నిఘాఉంచనున్నామని, ప్రతి బస్సులోనూ తనిఖీలు చేస్తామని, అధిక చార్జీలను వసూలు చేసి ఉంటే ఆ బస్సులకు జరిమానా, ఆ తదుపరి సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జన జాతర!

జన జాతర!