టాస్మాక్‌ దుకాణాల్లో క్యూ ఆర్‌ కోడ్‌తోనే చెల్లింపులు | - | Sakshi
Sakshi News home page

టాస్మాక్‌ దుకాణాల్లో క్యూ ఆర్‌ కోడ్‌తోనే చెల్లింపులు

Oct 13 2025 7:28 AM | Updated on Oct 13 2025 7:28 AM

టాస్మాక్‌ దుకాణాల్లో  క్యూ ఆర్‌ కోడ్‌తోనే చెల్లింపులు

టాస్మాక్‌ దుకాణాల్లో క్యూ ఆర్‌ కోడ్‌తోనే చెల్లింపులు

– సిబ్బంది అదనంగా రూ. 10 వసూలు చేయకుండా చర్యలు

కొరుక్కుపేట: తమిళనాడు అంతటా టాస్మాక్‌ దుకాణాలలో విక్రయించే మద్యం సీసాలపై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు. దీనిని పూర్తిగా ఆపడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు మద్యం బాటిల్‌పై ముద్రించిన రిటైల్‌ ధరకే అమ్ముడయ్యేలా అధికారులు కఠినమైన చర్యలు తీసుకున్నారు. క్యూ ఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయడం ద్వారా చెల్లించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు కొన్ని నెలల క్రితం అన్ని టాస్మాక్‌ దుకాణాలలో ఈ వ్యవస్థను అమలు చేశారు. కానీ అది పూర్తిగా అమలు కాలేదు. ఈ పరిస్థితుల్లో టాస్మాక్‌ ఉద్యోగులు క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా ఓ నిర్దిష్ట ధరకు మాత్రమే మద్యం బాటిళ్లను విక్రయించాలని సూచించారు. తమిళనాడు అంతటా దీన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

సీఎం ఇంటికి బాంబు బెదిరింపు

–యువకుడి అరెస్ట్‌

కొరుక్కుపేట: చైన్నెలోని అల్వార్‌పేటలోని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఇంటికి శనివారం ఫోన్‌లో బాంబు బెదిరింపు వచ్చింది. తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బెదిరింపు వచ్చిన సెల్‌ఫోన్‌ నంబర్‌ తిరుపోరూరుకు చెందిన అయ్యప్పన్‌ అని తేలింది. ఇప్పటికే బాంబు బెదిరింపులకు పాల్పడినందుకు ఈ దివ్యాంగుడిని రెండుసార్లు అరెస్టు చేశారు. కోయంబేడు బస్‌స్టేషన్‌సహా కొన్ని ప్రాంతాలకు బాంబు బెదిరింపులు చేశారు. గతంలో మంత్రి ఇంటికి బాంబు బెదిరింపులకు పాల్పడినందుకు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం ఇంటికి బాంబు బెదిరింపు కేసులో కూడా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.

చైన్నెలో 50 శాతం తగ్గిన

దగ్గు మందుల అమ్మకం

కొరుక్కుపేట: మధ్యప్రదేశ్‌లో ‘కోల్డ్‌రిప్‌’ దగ్గు మందు తాగిన తర్వాత కొందరు పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. వీరంతా కాంచీపురం జిల్లా సుంగుకవర్చత్రంలో పనిచేస్తున్న శ్రీసాన్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారు చేసిన దగ్గు మందును వారు సేవించినట్లు గుర్తించారు. ఈ దగ్గు మందును తయారు చేసినప్పుడు ‘డైథిలిన్‌ గ్లైకాల్‌’ పరిమాణం 48.6 శాతానికి పెరిగిందని, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే ‘పొపైలిన్‌ గ్లైకాల్‌’ ను ఉపయోగించడం వల్ల పిల్లల మూత్రపిండాలు ప్రభావితమవుతాయని పరిశోధనలో గుర్తించా. దీంతో చైన్నెలోని కోడంబాక్కంకు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ యజమాని రంగనాథన్‌ (75)ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీసాన్‌ ఫార్మా ఫార్మాస్యూటికల్‌ కంపెనీని కూడా సీజ్‌ చేశారు. 23 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో దగ్గు మందు శ్రీకోల్డ్రిప్‌శ్రీను ఇప్పటికే నిషేధించారు. ఈ పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా అదే నిబంధన విధించారు. కాగా ఈ ప్రభావంతో చైన్నెలో చైన్నెలో దగ్గు మందు అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చైన్నెకి చెందిన డ్రగ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. చైన్నెలో 4,000 కంటే ఎక్కువ మందుల దుకాణాలు ఉన్నాయి. ఈ మందుల దుకాణాల్లో దగ్గు మందు అమ్మకాలు 50 శాతం తగ్గాయని వారు పేర్కొన్నారు. మందుల దుకాణాల్లో దగ్గు మందు కొనడానికి వచ్చేవారు వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్లు తీసుకురావాలని కోరుతున్నామని వారు వెల్లడించారు.

వరుసగా ఢీ కొన్న వాహనాలు

– నుజ్జునుజ్జయిన లగ్జరీకారు

– నలుగురు మిత్రులు బలి

సేలం : సేలం – కృష్ణగిరి రహదారిలో ఒక దాని తర్వాత మరొకటి చొప్పున వాహనాలు ఆదివారం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో మిత్రులు నలుగురు బలయ్యారు. వివరాలు.. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ముగిళన్‌(30) బెంగళూరలోని యూపీఎస్సీ పరీక్షల కోసం ఓ ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతూ వస్తున్నాడు. మిత్రులు మణి వన్నన్‌, మదన్‌కుమార్‌, గోకుల్‌లతో కలిసి కారులోస్వగ్రామానికి బయలు దేరాడు. ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో హోసూరు – కృష్ణగిరి జాతీయ రమదారిలో పెరండపల్లి అటవీ ప్రాంతంలో కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. చిన్న పాటిగాయాల పాలైన మిత్రులు తక్షణం కారు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేయగా, వెంటనే వెనుక వస్తున్న లారీ ఢీకొంది. ఆ తర్వాత వెనుక వచ్చిన వాహనాలు ఒకటి తర్వాత మరొకటి క్షణాలలో ఢీకొన్నాయి. దీంతో మిత్రులు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న హోసూరు పోలీసులు సఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టంమీద కారులో జీవచ్ఛవాలుగా పడి ఉన్న మిత్రులను బయటకు తీశారు. నలుగురు మిత్రులు ఘటనా స్థలంలోనే మరణించారు. వెనుక అతి వేగంగా వస్తున్న వాహనాలన్నీ ఢీ కొట్టుకోవడంతోనే మిత్రుల కారు నుజ్జునుజ్జయ్యింది. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హోసూరు ఆస్పత్రికి మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈమేరు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా గంటన్నర పాటూ జాతీయ రహదారిపై వాహన రాకపోకలు స్తంభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement