
పిటిషన్లలో.. కొత్త ట్విస్టు
సిట్‌కు వ్యతిరేకంగా బాధితుల పేర్లతో దాఖలైన పిటిషన్లలో సరికొత్త ట్విస్టు ఓ మీడియా పరిశీలనలో వెలుగు చూసింది. ఆ పిటిషన్లతో తమకు సంబంధం లేదంటూ బాధితులు వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. దీంతో కోర్టును ఆశ్రయించిన వారంతా కరూర్ ఘటనతో సంబంధం లేని వ్యక్తులు అన్న వాదనను సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచే అవకాశాలతో సోమవారం సీబీఐకు కేసు అప్పగింతకు సంబంధించిన తీర్పు వెలువడేనా? అన్న చర్చ ఊపందుకుంది.
సాక్షి, చైన్నె : కరూర్‌లో టీవీకే నేత విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 160 మంది గాయపడ్డారు. ఈ కేసును హైకోర్టు ఆదేశాలతో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం విచారిస్తోంది. ఈ విచారణను వ్యతిరేకిస్తూ టీవీకేతో పాటూ బాధితులుగా పేర్కొంటూ పలువురు పిటిషన్‌లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదన, విచారణ ముగియగా సోమవారం తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ పరిస్థితులో ఈ ఘటనలో మరణించిన బాలుడు ప్రీతిక్ (9) అమ్మమ్మ నాగమణి ఆ మీడియా ముందుకు వచ్చారు. ప్రితిక్ తన కుమార్తె షర్మిల కుమారుడు అని, తన వద్దే పెరిగినట్టు వివరించారు. కోర్టులో పిటిషన్ వేసిన పన్నీరు సెల్వం ప్రితిక్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రితిక్ ఆరు నెలల బిడ్డగా ఉన్న సమయంలో తన కుమార్తెను విడిచి పెట్టి మరో పెళ్లి చేసుకున్నాడని వివరించారు. తొమ్మిదేళ్లుగా బిడ్డ గురించి పట్టించుకోని వాడు, ఇప్పుడు హఠాత్తుగా కేసు వేశాడంటే, ఇందులో ఏదో మోసం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పన్నీరు సెల్వం ఎవరి దగ్గరో డబ్బు తీసుకుని ఈ పిటిషన్ వేసినట్టుందని పేర్కొన్నారు. అలాగే, మరో పిటిషనర్ సెల్వరాజ్ అయితే, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. తన భార్య చంద్ర మరణించిందని, ఈ సమయంలో అన్నాడీఎంకే నేత ఒకరు వచ్చి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తున్నట్టు పేర్కొంటూ, సంతకాలు పెట్టుకెళ్లాడని, ఇది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే వరకు వెళ్లినట్టు తనకు ఇప్పుడే తెలిసిందని పేర్కొన్నాడు. ఈకేసులో తనను లాగ వద్దు అని, తనకు సంబంధం లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఈ అంశాలను పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టుకు ఈ వివరాలను సమర్పించే అవకాశాలు ఉండటంతో తీర్పు రిజర్వుడ్‌లో పెట్టేనా లేదా హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ విచారణ సాగేనా లేదా, టీవీకే విజ్ఞప్తి మేరకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణకు ఆదేశించేనా అన్నది వేచి చూడాల్సిందే. కాగా పిటిషనర్లు పన్నీరు సెల్వం, సెల్వరాజ్ తరపున వాదనల సమయంలో న్యాయవాదులు సీబీఐ విచారణకు పట్టుబట్టి ఉండడం గమనార్హం.
17న కరూర్‌కు విజయ్
బాధితులను పరామర్శించేందుకు ఈనెల 17న విజయ్ కరూర్‌కు వెళ్లబోతున్నారు. బాధితుల కుటుంబాలందర్నీ ఒకే చోటకు చేర్చి వారిని పరామర్శించి, వారికి నష్ట పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకోసం అనుమతి కోరుతూ కరూర్ ఎస్పీ జోష్ తంగయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ పరామర్శ కార్యక్రమాన్ని ఓ హోటల్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే తొక్కిసలాట ఘటన జరిగిన ప్రదేశానికి ఈ హోటల్ సమీపంలో ఉండడంతో అనుమతి నిరాకరించారు. దీంతో కరూర్‌లోని రెండు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల మైదానాలను వేదికగా ఎంపిక చేయడానికి పరిశీలించారు. వీటిలో ఓ చోట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతి కోరుతూ సోమవారం ఎస్పీకి విన్నవించనున్నారు. అలాగే పోలీసు భద్రత కల్పించాలన్న విజ్ఞప్తిని లిఖిత పూర్వకంగా సమర్పించనున్నారు. కాగా, ఈ కేసును విచారిస్తున్న ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ అధికారుల బృందం సోమవారం విచారణను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా నాలుగు విభాగాల అధికారులను విచారించేందుకు నిర్ణయించింది. అలాగే టీవీకేకు చెందినపలువుర్ని విచారణకు రావాలని సమన్లు జారీ చేసి ఉండడం గమనార్హం.