
గ్రామ బలమే.. రాష్ట్ర బలం
● సీఎం ఎంకే స్టాలిన్ ● 12,480 పంచాయతీల్లో గ్రామసభలు ● వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలు విన్న సీఎం
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం స్టాలిన్
గ్రామ బలమే రాష్ట్ర బలం అని, ప్రజా మద్దతుతో సమగ్రాభివృద్ధి వైపుగా పయనిద్దామని సీఎం ఎంకే స్టాలిన్ పిలుపు నిచ్చారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామసభలలో సీఎం స్టాలిన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా సందేశాన్ని ఇవ్వడమే కాదు, ప్రజా సమస్యలను ఆలకించారు. ప్రజల జీవితాలను మెరుగు పరిచే దిశగా , గ్రామీణ ప్రజల హక్కుల సాధన, అవగాహన కల్పించే రీతిలో తీర్మానాలు జరిగాయి.
సాక్షి, చైన్నె: ఏటా రాష్ట్రంలో సంవత్సరానికి ఆరు సార్లు (జనవరి 26, మార్చి 22, మే 1, ఆగస్టు 15, అక్టోబరు 2, నవంబరు 1) తేదీలలో గ్రామ సభలను 12,480 పంచాయతీలలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది అక్టోబరు 2న విజయ దశమి కావడంతో వాయిదా వేశారు. శనివారం అన్ని గ్రామాలలో సభలు జరిగాయి. ప్రజల అవసరాలు, సామాజిక న్యాయం, సమానత్వాన్ని చాటే విధంగా సభలు జరిగాయి. గ్రామీణాభివృద్ధి ప్రణాళికలను ప్రజల మద్దతుతో రూపకల్పన చేస్తూ తీర్మానాలు చేశారు.ఈ గ్రామ సభలను చైన్నెలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. చెంగల్పట్టు జిల్లా కోవలం పంచాయతీ, తెన్కాసి జిల్లా ముల్లికుళం పంచాయతీ, కోయంబత్తూరు జిల్లా వారపట్టి పంచాయతీ, విల్లుపురం జిల్లా కొండంగి పంచాయతీ, తంజావూరు జిల్లా తిరుమల సముద్రంలలో జరిగినగ్రామ సభలకు హాజరైన ప్రజలతో సీఎం స్టాలిన్‌మాట్లాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మూడు ముఖ్యమైన అంశాలను సీఎం ఈసందర్భంగా ప్రజలకు వివరించారు. ప్రత్యేకంగా గ్రామాలు, వీధులు, రోడ్లు, నీటి వనరులు ఇతర బహిరంగ ప్రదేశాలలో కులాల పేర్లను తొలగించాలని సూచిస్తూ తీర్మానాలు చేశారు. ‘‘మన ఊరు, మన ప్రభుత్వం’’ అనే శీర్షికతో తాజా గ్రామ సభ జరిగింది. గ్రామ పంచాయతీలలో 1.04.2025 నుంచి 30.09.2025 కాలానికి పరిపాలన, సాధారణ ఆర్థిక వ్యయం, 2024–25 సంవత్సరానికి గ్రామ పంచాయతీ ఆడిట్ నివేదిక, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పురోగతి, అన్నా గ్రామ పునరుజ్జీవన ప్రాజెక్టు పనుల పురోగతి, స్వచ్ఛ భారత్ మిషన్ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, దోమల నివారణ, డెంగీ కట్టడి , ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ నైపుణ్య శిక్షణ పథకం సంబంధించి, ఎంపిక చేయబడిన 7,515 గ్రామ పంచాయతీలలో గ్రామస్థాయి సర్వేలు నిర్వహించడం, 2025–26 సంవత్సరానికి ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేయబడిన పంచాయతీలలోని గ్రామాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించే విధంగా మొత్తంగా 16 తీర్మానాలను గ్రామ సభలలో ఆమోదించారు. ఆయా జిల్లాలోని గ్రామాలలో జరిగిన గ్రామ సభలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు , స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు హజరయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం స్టాలిన్‌తో పాటుగా సీఎస్ మురుగానందం, తమిళనాడు ఈ–గవర్నెన్స్ ఎండీ పి. రమణ సరస్వతి, సచివాలయం నుంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్‌దీప్ సింగ్ బేడి, కమిషనర్ పి. పొన్నయ్య హాజరయ్యారు.
హక్కుల కల్పనే లక్ష్యం
ప్రజలు తమ తమ పంచాయతీ పరిపాలనలో, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ, అన్ని రకాల హక్కులను కల్పించడమే తన ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించారు. ఈ గ్రామసభ సమావేశాలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా పేర్కొంటూ, గ్రామాల ప్రస్తుత అవసరాలు, అభివృద్ది అంశాలను నేరుగా చర్చించి తీర్మానించే ఓ పండుగా అని వ్యాఖ్యలు చేశారు. మన ఊరు, మన ప్రభుత్వం పేరుతోఈ గ్రామసభలలో ప్రత్యేకంగా 3 ప్రధాన అంశాలను ఎంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాలలోని ప్రతి వ్యక్తికి కూడా అనేక బాధ్యతలు ఉంటాయని గుర్తుచేస్తూ, వాటన్నింటిని జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ, మన గ్రామాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్దామని పిలుపు నిచ్చారు. అలాగే అధికారులతో సహా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పథకాలను, ప్రాజెక్టులను , తాగునీటి అవసరాలు, ఇతర నిర్మాణాలు, విద్యా, ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాలలో అంటు వ్యాధులు , డెంగీ, చికున్ గున్యా, సీజన్, వైరల్ ఫీవర్ వంటివి ప్రబలకుండా ఆరోగ్య పరంగా ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోకి అడుగు పెట్టనున్నామని గుర్తు చేస్తూ, అన్ని పంచాయతీలలో ముందస్తు అత్యవసర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి ప్రాథమిక సేవలను నిర్ధారించాలని, ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. విపత్తుల వేళ కొన్ని సమయాల్లో తలెత్తే ప్రమాదాలను నివారించేందుకు సమష్టిగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల పరిపాలన, ఆర్థిక నిర్వహణ పారదర్శకంగా ఉండాలని, బడ్జెట్, వ్యయ సంబంధింత వివరాలను గ్రామసభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని వివరించారు. గ్రామ సభలలో ప్రజలు సూచించే ప్రతి అంశం, ప్రతి సమస్యను సకాలంలో పరిష్కరించడం అమలు చేయడమే లక్ష్యంగా అధికారుల పనితీరు ఉండాలని సూచిస్తూ, మన గ్రామాలు అభివృద్ధికి భవిష్యత్తు అని, ఇది జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగా పేర్కొంటూ, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి వైపుగా దూసుకెళ్లడమే ఆకుండా గ్రామ బలమే రాష్ట్ర బలం అని చాటుదామన్నారు.
పల్లెలే వెన్నెముక
సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ మన దేశానికి వెన్నెముక మన పల్లెలు అని పేర్కొంటూ, అందుకే జాతిపిత గాంధీ సైతం భారత దేశ బలం గ్రామాలలో ఉందని వ్యాఖ్యలు చేసి ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి గ్రామాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పరిపాలనలు ప్రజాస్వామ్య బద్ధంగా , బంలగా ఉండాలన్న లక్ష్యంతో వివిధ ప్రాజెక్టులను తాము అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు. తమిళనాడు గ్రామ పంచాయతీల ప్రాజెక్టులు అభివృద్ధికి మూలాధారం అని పేర్కొంటూ, ఇంత వరకు ముఖ్యమంత్రులు ఎవ్వరూ గ్రామసభ సమావేశాలకు హాజరు కాలేదన్నారు. తమిళనాడు చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో, 10 వేలకు పైగా పంచాయతీలు ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా అనుసంధానించబడి ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఈ విధంగా గ్రామసభ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అని, అన్ని గ్రామాలలోకి ఇంటర్నెట్ సేవలు తీసుకెళ్లి గ్రామ సభలను విజయవంతం చేసిన ఐటీ మంత్రి పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్‌ను అభినందిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు.అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా ఉన్న గ్రామాల అభ్యున్నతికి కృషి చేస్తున్న గ్రామీణాభివృద్ధి మంత్రి ఐ. పెరియస్వామి, కార్యదర్శి గగన్ దీప్‌సింగ్ బేడీ, కమిషనర్ పొన్నయ్యను కూడా అభినందించారు. ప్రజల దగ్గరకు వెళ్లి వారితో కలిసి జీవించండి, వారి నుంచి నేర్చుకోండి, వారిని ప్రేమించండి, వారికి సేవ చేయండి అన్న దివంగత నేత అన్నాదురై సూచనలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్నాదురై, కలైంజ్ఞర్ కరుణానిధి చూసిన బాటలో సామాజిక న్యాయం, సమానత్వం, సమధర్మం వంటి ఉన్నత ఆదర్శాలతో ముందడుగు వేస్తూ వస్తున్నట్టు వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళల పురోగతిని కాంక్షిస్తూఅమలు చేస్తున్న పథకాలను గురించి ఈసందర్భంగా గుర్తుచేశారు.