
తెలంగాణలో రైతులకు ప్రత్యేక శిక్షణ
తిరువళ్లూరు: తమిళనాడు సహకార యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు చెందిన 75 మంది రైతులకు మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ముల్కానూర్ ప్రాంతానికి తీసుకెళ్లి ప్రత్యేక శిక్షణ అందించారు. రాష్ట్రంలోని సహకార సంఘంలో సభ్యులుగా వున్న రైతులను వేర్వేరు రాష్ట్రాలకు తీసుకెళ్లి వ్యవసాయంలో సాగు పద్ధతులు, సహకార సంఘాల నిర్వాహణ, పాల ఉత్పత్తి సంఘాల పనితీరు, విత్తనాల వినియోగంపై శిక్షణ ఇప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, చెంగల్‌పట్టు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లోని జిల్లా ప్రాథమిక సహకార సంఘాలకు చెందిన 75 మంది రైతులను తెలంగాణ రాష్ట్రం సహకార శాఖ కేంఽద్రం, హైదరాబాదులోని ఇండియ వరి పరిశోధన కేంద్రానికి తీసుకెళ్లి శిక్షణ ఇచ్చారు. దీంతోపాటు ముల్కానూర్ మహిళా పాల ఉత్పత్తి సంఘంలోనూ శిక్షణ ఇప్పించారు. శిక్షణలో సంఘాల పనితీరును నేరుగా పరిశీలించడంతో పాటు వేర్వేరు అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో తమిళనాడు సహకార యూనియన్ అదనపు రిజిస్ట్రార్, డైరెక్టర్ రవిచంద్రన్ కరీంనగర్ రైతులతో ముచ్చటించి అక్కడి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనటలో ఇండియ వరి పరిశోధన హైదరాబాదు కేంద్రం డైరెక్టర్ గణేష్, కోఆర్డినేటర్ ప్రేమ్‌కుమార్, తమిళనాడు సహకార యూనియన్ సూపరింటెండెంట్ గోపినాఽథ్ భువన, మైథిలి, జిల్లా సంఘాల చెందిన డైరెక్టర్‌లు విజయశరవణన్, వేలు, కన్నన్, ధర్మేంద్రన్, మేనేజర్ ఆడలరసన్, మురళి, జయశీలన్, దేవరాజ్, దండపాణి పాల్గొన్నారు.