
గ్రామాలకూ సేవలు విస్తరించాలి
వేలూరు: రెడ్‌క్రాస్ సభ్యులు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సేవా కార్యక్రమాలను విస్తరింపజేయాలని వేలూరు కార్పొరేషన్ మొదటి జోన్ చైర్‌పర్సన్ పుష్పలత అన్నారు. కాట్పాడి జూనియర్ రెడ్‌క్రాస్ సంఘం, సీఎంసీ కంటి ఆస్పత్రి, వేలూరు జిల్లా దృష్టి లోప నివారణ సంఘం సంయుక్తంగా కాట్పాడిలోని రెడ్‌క్రాస్ భవనంలో రెడ్‌క్రాస్ కార్యదర్శి జనార్ధన్ అధ్యక్షతన ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. పుష్పలత మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే జీన్ హెండ్రీ డోనాండీన్ ఈ సంఘాన్ని ప్రారంభించారన్నారు. వీటిలోని సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రస్తుతం ఉచిత వైద్యశిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేసేందుకు అవసరమైన సాయం అందజేయాలన్నారు. రెడ్‌క్రాస్ సంఘం సమన్వయకర్త రబిరాజన్, సీఎంసీ కంటి ఆస్పత్రి శిబిరం మేనేజర్ జాన్ హిట్లర్, కౌన్సిలర్ చాముండీశ్వరి, రెడ్‌క్రాస్ ఉపాధ్యక్షులు విజయకుమారి, కోశాధికారి పయణి, శ్రీనివాసన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రాధాక్రిష్ణన్, ఆనంద్‌కుమార్, సుధాకర్, రెడ్‌క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.