
వివాహమైన 20 రోజులకే..
– నవవరుడు ఆత్మహత్య
తిరువళ్లూరు: దంపతుల మధ్య ఏర్పడిన వివాదంతో మనస్తాపం చెందిన నవవరుడు భార్యను వేరేగదిలో నిర్బందించి మరో గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా సెవ్వాపేట సిటిహెచ్ రోడ్డు ప్రాంతానికి చెందిన కార్తీకేయన్(37) ప్రైవేటు పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి ప్లురంబాక్కం గ్రామానికి చెందిన సమీప బంధువైన జయశ్రీ(25)తో వివాహమైంది. వివాహం జరిగినప్పటి నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం ఇరువురి మధ్య స్వల్పంగా చెలరేగిన వివాదంతో తీవ్ర మనస్తాపం చెందిన కార్తీకేయన్ భార్యను ఓ గదిలో ఉంచి నిర్బందించాడు. అనంతరం తను మరో గదికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో నిర్బందానికి గురైన జయశ్రీ సెవ్వాపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని గదిలో వున్న జయశ్రీని బయటకు తెచ్చారు. అనంతరం మరో గదిని తెరడానికి యత్నించగా సాధ్యంకాలేదు. దీంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా కార్తీకేయన్ శవమై వేలాడుతూ కనిపించాడు. దీంతో షాక్‌కు గురైన పోలీసులు మృతదేహాన్ని కిందకు దింపి శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా వివాహమైన 20 రోజులకే భార్యభర్త మద్య ఏర్పడిన స్వల్ప వివాదంతో మనస్తాపం చెందిన నవవరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.