
పుదుచ్చేరి సభలో రగడ
సాక్షి, చైన్నె : పుదుచ్చేరి అసెంబ్లీలో డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు రగడ సృష్టించారు. దీంతో వీరిని బలవంతంగా బయటకు స్పీకర్ ఎన్బలం సెల్వం గెంటించారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీని గురువారం స్పీకర్ ఎన్బలం సెల్వం సమావేశపరిచారు. ప్రభుత్వానికి సంబంఽధించిన కొన్ని ముసాయిదాలు, ఇతర ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఖర్చులు తదితర వాటికి ఆమోదం పొందేందుకు వీలుగా గురువారం ఒక్క రోజు సభ నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. ఉదయం సభ ప్రారంభం కాగానే, డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిపై చర్చించాల్సిన అవసరం ఉందని నినాదించారు. కేవలం బిల్లుల ఆమోదానికి సభ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, సభను కనీసం ఐదురోజులైనా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో స్పీకర్, ప్రతి పక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సీఎం రంగస్వామి సైతం ప్రతిపక్షాలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా, ఏమాత్రం డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు తగ్గలేదు. మంత్రులు, ప్రతి పక్ష సభ్యుల మధ్య సైతం వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు సభలో తీవ్ర రగడ, గందరగోళం నెలకొనడంతో డీఎంకే, కాంగ్రెస్ సభ్యులను బయటకు గెంటే యాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా ఎత్తుకొచ్చి అసెంబ్లీ బయట వదలి పెట్టారు. అధికారపక్షం తీరును ఖండిస్తూ స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలతో కాసేపు అసెంబ్లీ ప్రవేశమార్గంలో ప్రతి పక్ష సభ్యులు తమ నిరసనను తెలియజేశారు.