
పీఎంకే ఎవరిది..?
సాక్షి, చైన్నె : పీఎంకే ఎవరిది అన్న చర్చ ఊపందుకుంది. అన్బుమణిపై రాందాసు వర్గం ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై అధికారులు తర్జన భర్జనపడుతున్నారు. వివరాలు.. పీఎంకేలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్యసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. అన్బుమణి పార్టీ నుంచి రాందాసు తొలగించారు. ఈ పరిస్థితులలో అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా అంగీకరిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ గత వారం పంపిన ఓ లేఖ చర్చకు దారి తీసింది. ఇక, పీఎంకే అన్బుమణి గుప్పెట్లో అన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, అన్బుమణికి పంపిన లేఖకు వ్యతిరేకంగా రాందాసు తరపున కేంద్ర ఎన్నికల కమిషన్‌ను న్యాయవాదులు కలిసి వివరణ ఇవడం కొత్త ట్విస్టుకు దారి తీసింది. తన పదవీ కాలం ముగిసిన విషయాన్ని దాచి పెట్టి, సర్వ సభ్యసమావేశం తీర్మానాలతో ఎన్నికల కమిషన్‌ను అన్బుమణి తప్పుదోవ పట్టించినట్టు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలు కాస్త ఎన్నికల వర్గాలను అయోమయంలో పడేశాయి. దీంతో పీఎంకే వ్యవహారంలో తర్జన భర్జన పడుతున్నారు. దీంతో పీఎంకే ఎవరికి సొంతం అన్న చర్చ ఊపుందుకుంది.