
రైతన్న కంట కన్నీరు
తిరువళ్లూరు: రైతులు సాగు చేసిన వరి ధాన్యాలను డీబీసీ కేంద్రాల్లో కొనుగోలు కాలయాపన కావడంతో తిరువళ్లూరు సమీపంలో సుమారు 10 వేల వరి ధాన్యాల బస్తాలు నీటిలో తడిసి ముద్దయ్యింది. వరి ధాన్యం బస్తాల నుంచి మొలకలు రావడంతో తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. తిరువళ్లూరు రాష్ట్ర రాఽజధానికి పొరుగు జిల్లా అయినా ఇక్కడ వ్యవసాయంపై ఆదారపడి జీవించే వారు ఎక్కువగా వున్నారు. వివరాలు.. జిల్లాలో వరి, చెరుకు, పూలమొక్కలు, పండ్లు కూరగాయలు ఎక్కువగా సాగులో వుంది. ఇందులో భాగంగానే కడంబత్తూరు యూనియన్‌లోని చిట్రంబాక్కం, పేరంబాక్కం, తెన్‌కారణి తదితర ప్రాంతాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో 500 మంది రైతులు వరి పంటలను సాగు చేశారు. పంటలను దిగుబడి చేసిన క్రమంలో నెల రోజుల క్రితం కోత కోసి వాటిని ఎండబెట్టి డీబీసీ కేంద్రాల వద్ద డంప్ చేసి సిద్ధంగా ఉంచారు. ఎండలు, వర్షం నుంచి పంటలను రక్షించుకోవడానికి రైతులు ప్లాస్టిక్ కవర్‌లను కప్పి ఉంచారు.
మద్దతు ధరకోసం నిల్వచేస్తే..
రైతులు దిగుబడి చేసిన వరి పంటలను కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వడానికి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సుమారు 65 డీబీసీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు సాగు చేసిన వరిని డీబీసీ కేంద్రాల్లో నేరుగా విక్రయించుకోవచ్చు. ఒకరైతు నుంచి సరాసరిన ఎకరాకు 30 బస్తాల(41 కేజీల) ధాన్యాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇందు కోసం ముందస్తుగానే ఆన్‌లైన్‌లో రైతులు దరఖాస్తు చేసుకుంటే, వారికి ప్రభుత్వం అనుమతి ఇచ్చి కొనుగోలు చేస్తుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాలకు 15 రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాకు నగదును ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. తద్వారా రైతులను దళారుల మోసాలకు గురికాకుండా కాపాడడంతో పాటు రైతులకు మద్దతు ధరను కల్పించడమే ప్రధాన ఉద్దేశం. మోటా రకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2,500, సన్నరకం క్వింటాల్‌కు రూ. 2,545ను ప్రభుత్వం నిర్ణయించి రైతులకు ఇస్తుంది. మూడు రోజుల నుంచి వర్షం గతంలో రైతులకు మద్దతుధర లేకపోవడంతో పాటు దళారుల చేతిలో మోసాలకు గురయ్యేవారు. అయితే జిల్లాలో డీబీసీ కేంద్రాల ద్వారా వరి కొనుగోలు చేసి మద్దతు ధరను సకాలంలో ప్రభుత్వం ఇవ్వడం మొదలు పెట్టిన తరువాత రైతులు డీబీసీ కేంద్రాల్లోనే వరిని విక్రయించడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పేరంబాక్కం డీబీసీ కేంద్రం వద్ద సుమారు పది వేల బస్తాలు పేరుకపోయాయి. అయితే గత మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు వరి తడిసి ముద్దయ్యింది. కొన్ని బస్తాల్లో మొలకలు రావడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికై నా వరి ధాన్యాలను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దీంతో పాటూ బస్తాకు డీబీసీ కేంద్రాల్లో రూ.45 లంచం డిమాండ్ చేస్తున్నారని అధికారులు వాటిపై సైతం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రైతన్న కంట కన్నీరు